Suresh Kondeti | ఇకపై ఆ 'జర్నలిస్ట్' కనిపించడా?

Suresh Kondeti - వివాదాస్పద జర్నలిస్ట్ సురేష్ కొండేటిపై నిషేధం అంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత..?

Advertisement
Update: 2023-12-16 15:23 GMT

వివాదాస్పదంగా మారిన సురేష్ కొండేటిని తెలుగు ఫిలిం జర్నలిస్టులు బహిష్కరించారు. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. కొంతకాలం పాటు సురేష్ కొండేటిని ప్రెస్ మీట్స్ కు దూరంగా ఉంచాలని జర్నలిస్ట్ సంఘాలు నిర్ణయించాయి.

కొన్ని కీలక అంశాలపై చర్చించేందుకు.. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, క్రిటిక్స్ అసోసియేషన్ కలిశాయి. వీళ్లకు మరికొంతమంది పీఆర్వోలు కూడా కలిశారు. అంతా కలిసి ఓ జాయింట్ కమిటీగా ఏర్పాటై, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నిర్ణయాల్లో భాగంగా వివాదాస్పద సురేష్ కొండేటిని కొంతకాలం పాటు ప్రెస్ మీట్స్ కు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఏటా అతడు నిర్వహించే అవార్డుల ఫంక్షన్ ఈసారి చాలా గందరగోళానికి దారితీసింది. దీనిపై కొంతమంది పరభాషా నటులు అంతర్గతంగా ఫిర్యాదుచేసినట్టు తెలుస్తోంది. మరోవైపు సదరు హీరోల ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో టాలీవుడ్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. మరీ ముఖ్యంగా మెగా కాంపౌండ్ ను ట్రోలింగ్ చేశారు.

దీంతో ఈ వివాదంపై అల్లు అరవింద్ స్పందించాల్సి వచ్చింది. సురేష్ కొండేటికి, మెగా కాంపౌండ్ కు సంబంధం లేదని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ లెటర్ జారీ చేసింది. ఈ లేఖతో పాటు జరిగిన పరిణామాల ఆధారంగా సినీ జర్నలిస్ట్ సంఘం, సురేష్ కొండేటిపై తాత్కాలికంగా వేటు వేయాలని నిర్ణయించింది.

జరిగిన ఘటనపై సురేష్ కొండేటి విచారం వ్యక్తం చేశాడు. క్షమాపణలు కోరుతూ లేఖ విడుదల చేశాడు. అయినప్పటికీ అతడిపై వేటు తప్పలేదు. అవార్డుల రచ్చ కంటే ముందే సురేష్ కొండేటి వివాదాస్పదమయ్యాడు. హీరోయిన్ నేహా శెట్టి ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో చెప్పమంటూ సిద్ధూ జొన్నలగడ్డను ప్రశ్నించి, అందరితో తిట్లు తిన్నాడు. అప్పట్లో అది వివాదాస్పమైంది. ఆ తర్వాత తన ప్రశ్నలతో పలు వివాదాలకు మూలకారణమయ్యాడు కొండేటి. తేజ లాంటి దర్శకులతో చీవాట్లు తిన్నాడు.

ఇకపై ఆయన ప్రెస్ మీట్స్ లో కనిపించడు. ఫలానా ప్రెస్ మీట్ కు రావాల్సిందిగా అతడికి ఆహ్వానాలు అందవు. ఒకవేళ ఆయన వచ్చినా, ప్రెస్ మీట్ లో అతడి చేతికి మైక్ ఇవ్వరు.

అయితే సురేష్ కొండేటి మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నాడు. తనపై నిషేధం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదంటున్నాడు ఇతగాడు. ప్రస్తుతం తను ఆధ్యాత్మిక పర్యటనల్లో బిజీగా ఉన్నానని, త్వరలోనే ప్రెస్ మీట్స్ లో కనిపిస్తానని అంటున్నాడు. మరి కొండేటి చెప్పింది నిజమా..? జర్నలిస్ట్ సంఘాలు చెబుతున్నది నిజమా? మరికొన్ని రోజుల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. 

Tags:    
Advertisement

Similar News