Poonam Kaur fibromyalgia: పూనమ్ కౌర్‌కు ఫైబ్రో మయాల్జియా.. ఈ అరుదైన వ్యాధి లక్షణలు తెలుసా?

Poonam Kaur fibromyalgia: పూనమ్ కౌర్ ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద నిపుణుల వద్ద ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఆమె అక్కడే ఉంటున్నారు.

Advertisement
Update: 2022-12-01 11:40 GMT

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ నిత్యం మీడియాలో కనిపిస్తుంటారు. చేనేత కార్మికుల పక్షాన వారి సమస్యలను ఎత్తి చూపడంతో పాటు, ప్రజా సమస్యలపై కూడా గొంతు విప్పుతుంటారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో ఉన్న వివాదం కారణంగా పూనమ్ ఎక్కువగా ప్రజలకు పరిచయం. తనను పీకే ఫ్యాన్స్ ఎంత ట్రోలింగ్ చేసినా నిబ్బరంగా ఎదుర్కున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రలో రాహుల్‌తో కలిసి నడిచారు. సినిమాల్లో కంటే రాజకీయ పరమైన విషయాలే పూనమ్‌కు ఎక్కువ పబ్లిసిటీని తీసుకొని వచ్చాయి. అయితే, పూనమ్ కౌర్ ఇటీవల అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది. గత రెండేళ్లుగా ఆమె ఫైబ్రో మాయాల్జియా అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం కేరళలో దీనికి ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు తేలింది. అయితే, ఇప్పటి వరకు వినని ఈ ఫైబ్రో మయాల్జియా వ్యాధి ఎవరికి వస్తుంది? దీని లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా ఉంటుందనే విషయాలు పరిశీలిద్దాం.

ఫైబ్రో మయాల్జియా అనే వ్యాధి శరీరంలోని కండరాలు, ఎముకలు, జాయింట్స్‌కు వస్తుంది. దీని వల్ల విపరీతమైన నొప్పి ఉండటంతో పాటు అలసట, అతి నిద్ర, మెమరీ లాస్, మూడ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ వ్యాధి ఉన్న వారి మెదడు నొప్పిని కలుగ జేసే సిగ్నల్స్‌ను వెలువరిస్తుంటుంది. దీని వల్ల తలనొప్పే కాకుండా వెన్ను నొప్పి కూడా వస్తుంది. ఇదొక దీర్ఘ కాలిక వ్యాధి. ఒకసారి దీని బారిన పడితే నెలలు.. ఒక్కోసారి ఏడాది పాటు అలాగే ఉంటుంది.

సాధారణంగా ఏదైనా సర్జరీ జరిగినా, యాక్సిడెంట్స్ అయినా, ఇన్ఫెక్షన్‌కు గురైనా ఆ ట్రామా కారణంగా ఫైబ్రో మయాల్జియా లక్షణాలు మొదలవుతాయి. మానసికమైన ఒత్తిడి కూడా ఒక్కోసారి ఈ వ్యాధికి కారణం అవుతుంది. సాధారణంగా పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి, జాయింట్ పెయిన్స్, ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇప్పటి వరకు అల్లోపతిలో నయం చేసే మందులు లేవు. కానీ లక్షణాలను బట్టి మెడికేషన్ చేయడం ద్వారా వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. ఆయుర్వేదంలో కొన్ని పద్దతుల ద్వారా, యోగాను ఉపయోగించి వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.

పూనమ్ కౌర్ ప్రస్తుతం కేరళలో ఆయుర్వేద నిపుణుల వద్ద ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నారు. గత కొంత కాలంగా ఆమె అక్కడే ఉంటున్నారు. నగరంలో పలువురు అల్లోపతి వైద్యులను సంప్రదించినా తగ్గక పోవడంతో ఆమె ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఎక్సర్‌సైజ్, టాకింగ్ థెరపీతో పాటు ఇతర మూలికల మందులు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. అయితే, చికిత్సకు సంబంధించిన ఫొటో ఒకటి బయటకు రావడంతో అసలు విషయం తెలిసింది. మరి కొన్ని రోజులు పూనమ్ కేరళలో చికిత్స తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News