పదవికే విరమణ.. పనికి కాదు .. 60 తరువాత కూడా పనిపై ఆసక్తి చూపుతున్న వృద్దులు

కెరీర్‌లో నిరంతరం పనిచేసిన ఉద్యోగులకు పని జీవితం నుంచి విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో పదవీ విరమణ ఇస్తారు. కానీ ఈ రిటైర్‌మెంట్‌తో ఒక్కసారిగా మనిషి జీవితంలో శూన్యత ఆవహిస్తుంది.

Advertisement
Update: 2023-11-27 11:15 GMT

వయస్సు శరీరానికే కానీ మనసు కాదన్నది కాదనలేని నిజం.. ఇప్పుడు ఈ విషయాన్నికొత్తతరం వృద్ధులు కూడా అంగీకరిస్తున్నారు. అందుకే వారు పదవీ విరమణ తర్వాత కూడా అలసిపోవడం లేదు. రిటైర్‌మెంట్‌ను విశ్రాంతి తీసుకునే సమయంగా భావించడం లేదు. పదవీ విరమణ తర్వాత పని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటూ ఉత్సాహంగా ముందుగు సాగుతున్నారు. ఎటువంటి పని చేయకుండా రోజంతా ఖాళీగా కూర్చోవడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో 32 శాతం సీనియర్లు పదవీ విరమణ వల్ల విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నమ్ముతున్నారు. రోజువారీ కార్యకలాపాల్లో చురుకుగా, ఉత్పాదకంగా ఉండాలని భావిస్తున్నారు. రిటైర్‌మెంట్ తర్వాత పని చేయడం వల్ల సుసంపన్నమైన, అర్థవంతమైన జీవితాన్ని పొందేలా భవిష్యత్తును నిర్మించుకుంటున్నారు.

కెరీర్‌లో నిరంతరం పనిచేసిన ఉద్యోగులకు పని జీవితం నుంచి విశ్రాంతి కల్పించే ఉద్దేశంతో పదవీ విరమణ ఇస్తారు. కానీ ఈ రిటైర్‌మెంట్‌తో ఒక్కసారిగా మనిషి జీవితంలో శూన్యత ఆవహిస్తుంది. హడావిడిగా గడిచిన జీవితం నుంచి విశ్రాంతి లభిస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లు ఒక్కసారిగా దీన్ని స్వీకరించలేరు. పూర్తిగా ఖాళీగా ఉండడంతో ఏమీ తోచదు. దీంతో ఒక్కసారిగా మానసిక పరిస్థితి దిగజారుతుంది. వయస్సుతో పాటు జ్ఞానం, సంపద, అవకాశాలు సమృద్ధిగా వస్తాయని వృద్ధులు నిరూపిస్తున్నారు. పదవీ విరమణ పొందిన వ్యక్తులు తమను తాము బిజీగా ఉంచుకోవడానికి మళ్లీ పని ప్రారంభిస్తున్నారు. దీని కోసం వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత పని చేయడం అనేది ఒకరి నైపుణ్యాలు, అభిరుచులను వేరే వారితో పంచుకోవడమే అని సీనియర్‌ సిటిజన్లు భావిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత జీవితం ఎదుగుదల, అభ్యాసం నిరంతర ప్రయాణం అనే భావనను కలిగిస్తుందని అంటున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇతర బాధ్యతల నుంచి ఒక్కసారిగా వచ్చిన మార్పును తట్టుకోవడానికి ఇలా వేరే కెరీర్‌ను ఎంచుకుంటున్నారు.

రోజంతా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ఉంటే మనస్సు ఉత్తేజం కోల్పోవచ్చు. పదవీ విరమణ తర్వాత పని చేయడానికి ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవడం మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు శక్తివంతమైన విరుగుడుగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మానసిక శ్రేయస్సు బావుంటుందని కూడా చెప్తున్నారు. పదవీ విరమణ పొందినవారు సలహాదారులుగా.. భవిష్యత్ తరాల మార్గదర్శకులుగా.. అభివృద్ధికి సహకారులుగా మారడం వల్ల సమాజం కూడా బావుంటుంది. పెరిగిన ఆర్థిక స్థిరత్వం నేటి ప్రపంచంలో, జీవన వ్యయం నిరంతరం పెరుగుతోంది. కేవలం పింఛను లేదా పొదుపుపై మాత్రమే ఆధారపడటం ఎల్లప్పుడూ కావలసిన జీవన ప్రమాణాలను కొనసాగించడానికి సరిపోదని కూడా నిపుణులు భావిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత పనిలో నిమగ్నమైతే తమ ఆదాయాన్ని భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక భద్రత గొప్ప ప్రశాంతతను అందిస్తుంది.

Tags:    
Advertisement

Similar News