కసుగాయలు

Advertisement
Update: 2022-12-21 15:48 GMT

చిరు ముట్టి కట్టిన చిన్ని పెయ్యకి

చిరు తపస్సు ఏదో ఫలించి నట్టుగా చివరికంటూపిండేసి నట్టి

అమ్మ పొదుగు అందుకో గలిగింది

చుక్క చుక్క చప్పరిస్తుంటే

చప్పగిల్లిన అమ్మ పొదుగుకు

చెప్ప లేని బాధ కలిగితే

చిట్టి దూడని కసురుకుంది

పట్టుమని పది సార్లు కూడ

ముట్టుకుని ముద్దాడకుండానే

తనివి తీరా తాకుతూ

తల్లి తనను నాక కుండానే

చిట్టి దూడను కొట్టుకుంటూ

కట్టురాటకు కట్టివేస్తే

తన వేడుకోలును లెక్క చేయక

తనకు వీడుకోలు చెప్పకుండానే

తల్లిని తోసుకుంటూ తోలుకెళ్లే

పాలికాపుపై దూడకు

పట్టలేని కోపమొచ్చెను

శాపం వాడికయితే కాదుగా మరి పాపం వాడు కూడా పాలుమరచి పట్టుమని పది ఏండ్లు దాటదు

పలక పట్టే పసిమిలోనే

పనికి కుదిరితే

నేరం వాడిదేముంది

పాప పుణ్యపు పద్దు రాసే

పరమాత్మకే ఎరుక గావలె

పసులు గాసే పాల బుగ్గల

పసి బాలలకీ శిక్షేంటో

కసుగాయలకు రక్షేదో.

- దుద్దుంపూడి అనసూయ

(రాజమండ్రి)

Tags:    
Advertisement

Similar News