సమసమాజ స్వాప్నికుడు దిగంబరకవి కీ .శే .మహాస్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు)

Advertisement
Update: 2023-06-25 11:57 GMT

తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించిన దిగంబర కవులలో ఒకరు. మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. దిగంబర కవిత్వోద్యమం ప్రారంభించినప్పుడు మహాస్వప్న పేరుతో రచనలు చేశారు.

మహాస్వప్న లింగసముద్రం లో కమ్మిశెట్టి వెంకయ్య, నారాయణమ్మలకు ఏకైక కుమారునిగా జన్మించారు వృత్తి రీత్యా వ్యవసాయదారుడైన ఆయన బ్రహ్మచారిగానే ఉండిపోయారు.

వారికి ఒక చెల్లెలు ఉంది. లింగసముద్రంలో ఆయన ఆమె దగ్గరే ఉంటూ వచ్చారు. ఇంటర్మీడియెట్‌ వరకు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చదువుకున్నారు .ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌కు వెళ్లా రు .

నిశ్శబ్దంగా ఉన్న కవిత్వరంగాన్ని హఠాత్తుగా ఉవ్వెత్తైన కెరటంలా విరుచుకుపడ్డ దిగంబర కవితోద్యమ నిర్మాతల్లో ఆయన ఒకరు. హైదరాబాదులోని వివేకవర్థిని కళాశాలలో బి.ఎ.చదువుతున్న రోజుల్లో అభ్యుదయ, ప్రగతిశీల సాహిత్యంతో ఆయనకు పరిచయం ఏర్పడింది.

1958లో పత్రికా సంపాదకుడు నార్ల చిరంజీవి సహకారంతో పద్దెనిమిదేళ్ల వయసులోనే చందమామ పేరుతో బాలకవితా సంపుటి వెలువరించారు.

1964లో అగ్నిశిఖలు, మంచుజడులు, స్వర్ణధూళి కవితాసంపుటాలను ప్రచురించారు .గొప్పశైలితో పరుషమైన, తీవ్రమైన, చురుక్కుమనిపించే పదజాల కూర్పు వీరి ప్రత్యేకత. కొన్ని సంవత్సరాల పాటు హైదరాబాదులో పత్రికా రంగంలో సంపాదకునిగా, బ్యాంక్ ఉద్యోగి గా పనిచేసారు

1965లో విప్లవ భావాలు కలిగిన తోటి స్నేహితులు మానేపల్లి హృషికేశవరావు, యాదవ రెడ్డి, బద్దం బాస్కరరెడ్డి, వీరరాఘవాచార్యులు, మన్మోహన్ సహాయ్ లతో వస్తువు, శిల్పం, శైలుల్లో అతినవ్యమైన పంథా అనుసరిస్తూ "దిగంబర కవిత్వం" అనే ఉద్యమాన్ని ప్రారంభించారు.

దిగంబర కవిత్వోద్యమ ఉత్సాహంలో వీరు తమ పేర్లను మార్చుకుని ప్రతీకాత్మకంగా నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవయ్యలుగా మారారు. వివిధ పత్రికల్లో, సంపుటాల్లో వచ్చిన వీరి కవిత్వం సాహిత్యలోకాన్నే కాక సమాజంలోని వివిధ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది.

మూడు సంవత్సరాల పాటు వీరి కవిత్వం తెలుగు సాహిత్యాన్ని ఏలిందని చెప్పవచ్చు.

ఎంత హఠాత్తుగా ప్రారంభమైందో అంతే హఠాత్తుగా ఈ ఉద్యమం 3సంవత్సరాల అనంతరం తెరమరుగైంది.

అనంతరం దిగంబర కవులు విడిపోయారు. దిగంబరకవులు నగ్నముని ,నిఖిలేశ్వర్ .

చెరబండరాజు ,జ్వాలాముఖి నలుగురు కవులు విరసం (విప్లవ రచయితలసంఘం)లోను‌,

భైరవయ్య మహాస్వప్న అరసం (అభ్యుదయ రచయితల సంఘం) లోను చేరారు.

మహాస్వప్న రచనలు సూటిగా, ఘాటుగా ఉంటూ పాఠకుల్ని లోతుగా ఆలోచింపజేస్తాయి

అయన 2019 జూన్ 25న లింగసముద్రంలోని తన గృహంలో మరణించాడు.

.

వికారపు శిలల్ని మానవులుగా మలిచేందుకు

మరణించిన భగవంతునికి ప్రాణం పోసేందుకు

నేను వస్తున్నాను

దిగంబరకవిని

వాచవిని

రాత్రి ఉదయిస్తున్న ప్రతిభారవిని

కలియుగం రేడియోగ్రామ్ లో

గిరగిర తిరుగుతున్న

క్రీ.శ. ఇరవయ్యో శతాబ్దం రికార్డు మీద పిన్నునై

మానవత రెండు కళ్ళూ మూసుకుపోయినప్పుడు

విప్పుకుంటున్న మూడోకన్నునై

కాలం వాయులీనం మీద కమానునై

చరిత్ర నిద్రాసముద్రం మీద తుఫానునై. ....

(గ్లానిర్భవతి భారత కవితలోని భాగం)

- బూర అరవింద ( చెన్నై)

Tags:    
Advertisement

Similar News