ఏరిన ముత్యాలు... సామాజిక విపర్యయాల సంగ్రహాలు.. పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు

Advertisement
Update: 2023-05-20 14:03 GMT

పెద్దిభొట్ల సుబ్బరామయ్య అనగానే ‘నీళ్లు’ కథానిక గుర్తుకొస్తుంది. భారతిలో ఆ కథ పడినప్పుడు అసామాన్యమైన స్పందన వచ్చింది. అదే అతనికి బ్రేక్! (1959లో ‘చక్రనేమి’ మొదటి కథ).

మూడవతరం తెలుగు కథకుల్లో-కోస్తాంధ్ర వారిలో - అందునా విజయవాడ వాడుగా - ఆయనది పెద్దపీట! ఆయన ఇతివృత్తాలన్నీ మధ్యతరగతి మనుషుల చుట్టూ తిరిగినవే! అందునా ఆచారవ్యవహారాలూ, సంప్రదాయాలూ, నిత్యనియమాల మధ్య నలిగి-ఇరుసునపెట్టిన కందెన లాంటి- జీవన విషాదాల్ని అనుభవించిన వారి కథలే ఎక్కువ. అక్కడక్కడా, దిగువ మధ్య తరగతి జనులు మనముందుకొస్తారు.

స్వాతంత్ర్యం కోసం సర్వం ధారపోసిన వారి ఈనాటి దీనస్థితి గురించీ రాశారు; క్షుద్రదానాలు పట్టే పేదబాపడి అసహాయస్థితి గురించీ రాశారు. (పూర్ణాహుతి కథ). బడుగు బాపనయ్యల అవస్థల్ని ఇంకా - భ్రమ, దుర్దినం, శుక్రవారం వంటి కథల్లోనూ చిత్రించారు. నిరాశా నిస్పృహల నిరుద్యోగులు, రైలుపెట్టెలూడ్చి పైసలడుక్కుని బతుకీడ్చే అధోజగత్ సహోదరులు, టీకొట్టు సింహాచలం, పేవ్మెంట్ వ్యాపారాల ‘కొలందవేళులు’ మనకు ఆయన కథల్లో కనపడి మనస్సులో అలజడి రేపుతారు.

ఆయన కథానికల్లో వాతావరణ చిత్రణ, నేపథ్య వర్ణన చాలా విస్తారంగా సాగుతాయి. ‘ముసురు’ కథ ఉదాహరణ. వాన, చీకటి - చాలాచోట్ల ప్రధాన పాత్రలు!! ‘అరవై ఏళ్ల తర్వాత రిటైరై బతికుండటమే పెద్ద తప్పు’ అంటూ కథ మొదలెడతాడు (మనసు కథ). శిల్పపరంగా మానవ వేదనా గాథల్లో స్ర్తీ పాత్రల్ని చిత్రించి అపూర్వమైన కథలు రాశారు పెద్దిభొట్ల. ‘మిస్ భారతి బి.ఏ’ ‘దగ్థగీతం’ వంటివి చాలా పేరుతెచ్చినాయి ఆయనకు.

పెద్దిభొట్ల చిన్న నవలల్లో ‘చేదుమాత్ర’; దానికంటే గొప్పదైన ‘అంగారతల్పం’ భారతిలో వచ్చి రచయితలనూ, విమర్శకులనూ అలరించాయి. పత్రికల్లో ఆయనకు లభించిన బహుమతులకు కొదవేలేదు. ఆ రోజుల్లో సుబ్బరామయ్య బందరు గ్రూపులో కలిసిన పెద్ద తలకాయ. (తానుండేది విజయవాడ-లయోలా కాలేజి ఉద్యోగం). ఆయనకంటే సీనియర్ రచయిత సింగరాజు రామచంద్రమూర్తి ఉండేవారు. ఆదివిష్ణు, విహారి-శాలివాహన, నందం రామారావు వంటి మిత్రులంతా శనివారం సాయంత్రం విజయవాడలో సుబ్బరామయ్యతో సమావేశమే. హవిస్ కలిసేవాడు.

సుబ్బరామయ్య వ్యక్తిత్వంలో చాలా విలక్షణత ఉండేది. రాత్రి పొద్దుపోయేదాకా మిత్రులతో తిరిగి, లీలామహల్లో సినిమాచూసి ఇంటికి వెళ్లి, భార్యకి ఘోర దారుణమైన తుఫానూ, వానా, వరదా-బీసెంట్ రోడ్లో చిక్కుబడిపోయానని, నమ్మబలికే వాడనేది పెద్ద జోక్! ఆమెకు తెలుసు. నవ్వి ఊరుకునేది(ట)! తన సిగరెట్ తాను కొనుక్కోవటానికి ఆయన దగ్గర ఎప్పుడూ ఏ వందనోటో ఉండేది! ఆ కొట్టువాడి దగ్గర చిల్లర వుండదు! ఈయన పక్కనున్న మిత్రుడు సంతోషంగా చిల్లర ఇచ్చేవాడు! ఆయన ఎన్నడూ ఒకటి కంటే ఎక్కువ సిగరెట్లు కొన్న దాఖలాలు లేవు.

సుబ్బరామయ్య ప్రకాశం జిల్లాలో జన్మించాడు. ఒంగోలులో హైస్కూల్ వరకూ చదువు. ఆ తర్వాతంతా విజయవాడే. కాలేజీ రోజుల్లోనే ఆయన విశ్వనాథ వారి ప్రశిష్యుడు. ఈయన ఇల్లు వారి నివాసానికి పరిసరంలోనే. అందుకని రోజూ వారిదగ్గర ఎక్కువ సమయమే గడిపేవాడు. సుబ్బరామయ్య తెలుగు సాహిత్య సంప్రదాయాల విజ్ఞత బాగా ప్రోది చేసుకున్న పండితుడు. కానీ, ఆ పార్శ్వాన్ని సాహిత్య రచనల్లోకి తేలేదు. ఆధునిక భావజాలంతో కథా నవలా రచనలో స్థిరపడ్డాడు.

సుబ్బరామయ్యకు గోపీచంద్ అవార్డు, రావిశాస్త్రి స్మారక సాహిత్య పురస్కారం, అరసం, పులుపుల శివయ్య సాహితీ సత్కారం, నేషనల్ బుక్ ట్రస్ట్ పురస్కారం, అజో విభో కందాళం వారి ప్రతిభామూర్తి పురస్కారం, కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు లభించాయి.

సుబ్బరామయ్య మంచి స్నేహశీలి. నేనంటే ప్రత్యేకమైన అభిమానం. కథల సంపుటి మొదటి వాల్యూమ్ ఆవిష్కరణ సభలో నేను వక్తను. ఎంతో సంతోషించాడు. ‘దగ్థగీతం’ కథను నా కథాకృతి సీరీస్లో విశ్లేషించినందుకు ఎంతగానో పొంగిపోయాడు. అయితే ‘చాసో వాయులీనం, ఘండికోట వారి కావేరీ సేతురామన్, శ్రీరమణ మరోకథా- ఈ ‘దగ్థగీతం’ ఒకే వస్తువుతో వచ్చిన కథలు అంటే కించిత్తు ఆశ్చర్యపోయాడు. ‘నీవంటి వారి నాలెడ్జ్ ని అభినందించాల్సిందే’ అనేశాడు. సున్నితమనస్కుడు. భార్య మరణాన్ని తన అనారోగ్యం బాధను తట్టుకోలేకపోయాడు. చాలా తరచుగా ఫోన్ చేసేవాడు.

‘నువ్ రా- విహారీ, నాకు రిలీఫ్’ అని గద్గదికంగా అనేవాడు. కాలు ఫ్రాక్చర్... హాస్పిటల్లో ఉండగానూ, ఆ తర్వాత చాలాసార్లు వెళ్లాను. ఎప్పుడూ ఏదో ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తూ వుండేవాడు. వాటి క్వాలిటీ గురించి చెప్పేవాడు.

ప్రగతిశీల రచయితగా సుబ్బరామయ్య మంచి పేరు సంపాదించుకున్నాడు. అరసం అధ్యక్షుడుగా కూడా వ్యవహరించాడు. తన జీవితకాలంలోనే తన పేరుమీద సాహిత్య పురస్కారాన్ని ప్రారంభించి ప్రతి ఏటా తన పుట్టినరోజు (డిశంబరు 15)న ప్రదానం చేయటం మొదలెట్టాడు. ఆయన మరణానంతరమూ అది కొనసాగుతున్నది.

‘విజయవాడ ఇంద్రకీలాద్రి శిలపైన చెక్కవలసిన మానవ వేదనాగాథల - పౌరాణికుడు ఈ పెద్దిభొట్లవారు’ అన్నారు సుప్రసిద్ధ కథా రుషి మునిపల్లెరాజుగారు! ఎంతో సార్థకమైన అభిప్రాయం!  *

- విహారి

Tags:    
Advertisement

Similar News