స్వగతాలు

Advertisement
Update: 2023-01-20 09:16 GMT

పుట్టాక మళ్ళీ పుట్టింటిని

చూళ్ళేని నది మౌన స్వగతం

రాళ్ళురప్పల దెబ్బల్తో

ముళ్ళపొదల గాయాల రక్తంతో

చెట్ల కూకటి వేళ్ళను

గట్ల మట్టిని తొలుచుకుంటూ

శ్రమజీవనం మునకై

నీటి సంపద సముద్రానికి అర్పితం!

కూర్చొని తింటే కొండైనా కరుగుతుంది

సంద్రానికి వర్తించని నానుడి

సింహాసనం అధిష్టించిన సముద్రం

ఎన్నడూ కరిగిపోదు తరిగిపోదు.

సముద్రానికి శ్రమ ఫలితం సమర్పించి

జీవితం నిర్వీర్యం!

నోరెండిన ఏరు

దాహార్త మూగ స్వగతం

రామపాదం సోకగానే

రాయి స్త్రీగా మారినట్లు

అప్పటి వరకు జీవంలేని ఏరు

వర్షం స్పర్శకు ప్రాణమౌతుంది.

భూమాతను తడిపిన

బొట్టు బొట్టును కూడదీసి

ప్రవాహమై హరితమౌతుంది

గ్రీష్మఋతువు శాపానికి మరణిస్తే

వర్ష ఋతువు ఊపిరి పోస్తుంది.

వర్షం ఏటి సంజీవని!

ఎండిన చెరువు మౌన స్వగతం

నీరు నిండిన వేళ ఊరంతా

గంగమ్మకు ఫల పుష్ప శుభకర పూజలు

నెలలు నిండిన తల్లిగా

కరకట్టలు జాగరణై కాస్తే

ఈ గట్టు పంపిన వార్తల్ని

అలలు అలా అలా నాట్యాభినయంతో

ఆవలి గట్టు చెవికి చేర్చేవి

ఎత్తుకు పైయ్యెత్తయి

జాలరి గాలాన్ని

చేపలు శృంగభంగం చేసేవి.

నీటికోడి ఒకే రేఖపై

ఈదుతూ సాగితే

దీక్షగా కవి రాస్తున్న వాక్యంలా వుండేది.

మధ్యన కోడిని అలసట ఆపితే

పద నిర్మాణానికి కవి కలం ఆగినట్లుండేది!

ప్రపంచ రంగస్థలిపై

జనాలకే కాదు ఆ జీవాలకూ

స్వగతాలున్నాయి.

అచరాలకు అక్షరం

ప్రాణం పొయ్యాలి!

అడిగోపుల వెంకటరత్నం

Tags:    
Advertisement

Similar News