దళితులకు వైసీపీ ఎమ్మెల్యే క్షమాపణ.. ఎందుకంటే..?

కేవలం టీడీపీ అనుకూల మీడియా తన మాటల్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు కోన రఘుపతి. రాజకీయ ట్రాప్ లో పడొద్దని ఆయన దళిత సంఘాల నేతలకు సూచించారు.

Advertisement
Update: 2023-04-07 05:56 GMT

వైసీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దళితులకు క్షమాపణ చెప్పారు. తన మాటలకు వారు నొచ్చుకుని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. దళితులను తమ కుటుంబం ఎంతగానో ఆదరించిందని, తమ రాజకీయ వృద్ధిలో దళిత సోదరుల కృషి ఎంతో ఉందన్నారు రఘుపతి. కేవలం టీడీపీ అనుకూల మీడియా తన మాటల్ని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ ట్రాప్ లో పడొద్దని ఆయన దళిత సంఘాల నేతలకు సూచించారు. బాపట్లలో కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

అసలేం జరిగింది..?

ఏపీలో జిల్లాల పునర్విభజన జరిగి ఏడాది అయిన సందర్భంగా బాపట్ల జిల్లా ఆవిర్భావ వేడుకల్లో కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ డ్ కావడం దురదృష్టకరమని అన్నారాయన. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన సందర్భంలో నెల్లూరుని ఓసీ చేయడం కోసం బాపట్లని ఎస్సీలకు రిజర్వ్ చేశారని చెప్పుకొచ్చారు. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం బాపట్ల పార్లమెంట్ లో కలిపారని, అందుకే బాపట్లను కూడా ఎస్సీ రిజర్వ్ డ్ చేశారని చెప్పుకొచ్చారు. లేకపోతే పొన్నూరుతో కలసి బాపట్ల ఓసీ నియోజకవర్గంగా ఉండేదన్నారు. ప్రస్తుతం కోన.. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఫలానా నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ డ్ కాకపోయి ఉంటే బాగుండేదని అన్నారు కోన. దీంతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా కాస్త మంట పెట్టాయి. బాపట్ల నియోజకవర్గంలో కోన రఘుపతికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. కోన రఘుపతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు దళిత సంఘాల నేతలు. కొంతమంది కోన రఘుపతి శవయాత్రలు చేశారు, ఆయన దిష్టిబొమ్మలు ద‌గ్ధం చేశారు. దీంతో కోన రియాక్ట్ అయ్యారు. ఇది ప్రతిపక్షాల కుట్ర అన్నారు. తన వ్యాఖ్యలకు పెడర్థాలు తీశారని మండిపడ్డారు. క్షమాపణ వీడియో విడుదల చేశారు. 

Tags:    
Advertisement

Similar News