వైసీపీ మహిళా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అందరికీ అణిగిమణిగి ఉండాలా..? నీళ్లకోసం మాట్లాడితే పెద్ద నేరమా..? అన్నారు ఎమ్మెల్యే పద్మావతి. అనంతపురంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు, వెటరన్ నాయకులను ప్రశ్నించకూడదా అన్నారు.

Advertisement
Update: 2024-01-08 05:52 GMT

శింగనమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫేస్ బుక్ లైవ్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్న చూపా.. అంటూ నిలదీశారు. అధికార పార్టీలో ఉంటూ ఆమె ఈ ఆరోపణలు చేయడంతో వైసీపీలో అంతర్గత‌ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. శింగనమల నియోజకవర్గానికి నీళ్లివ్వడంలేదనేది ఆమె ప్రధాన ఆరోపణ. తమ నియోజకవర్గం నుంచి కాలువలు వెళ్తున్నా.. తమ ప్రాంతం వారికి మాత్రం నీరు అందడంలేదని, ఐఏబీ మీటింగ్ లో కూడా ఈ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. నీళ్లు కావాలంటే సీఎం ఆఫీస్ కి వెళ్లి పంచాయితీ పెట్టుకోవాలా అని నిలదీశారు.


Full View

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అందరికీ అణిగిమణిగి ఉండాలా..? నీళ్లకోసం మాట్లాడితే పెద్ద నేరమా..? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే పద్మావతి. ఇప్పటి వరకు వేచి చూసి విసిగిపోయానని, ఇకపై పోరాటమే శరణ్యం అన్నారు. కుప్పంకు నీళ్లిస్తున్నారు కానీ, ఆ కాలువలు వెళ్లే భూములున్న శింగనమలకు నీళ్లెందుకివ్వరన్నారు ఎమ్మెల్యే. అనంతపురంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు, వెటరన్ నాయకులను ప్రశ్నించకూడదా అన్నారు పద్మావతి. అనంతపూర్ ట్యాంక్ లోకి డ్రైనేజీ నీళ్లను వదలడాన్ని ఎలా సమర్థిస్తారని నిలదీశారు. ప్రజల ఆరోగ్యం పాడవుతున్నా.. మీకు పట్టదా అన్నారు. శింగనమల ఎమ్మెల్యే ఎస్సీ మహిళ కాబట్టి నోరు తెరిచి మాట్లాడకూడదా..?, అలా మాట్లాడితే వెటరన్ పొలిటీషియన్లకు సమస్య ఏంటి అన్నారు.

వైసీపీకి ఏమైంది..?

ఒకరో ఇద్దరో అసంతృప్తులున్నారంటే సర్లే అనుకోవచ్చు, పోనీ టికెట్లు దొరకనివారంతా తిరుగుబాటు చేస్తున్నారంటే అధికారదాహం అనుకోవచ్చు. కానీ, ఒక్కొక్కరే ఇలా బయటపడుతున్నారంటే కచ్చితంగా ఆ వ్యవహారాలన్నిటిపై దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది, శింగనమల నీళ్ల వ్యవహారం ఐదేళ్లుగా పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోలేదు..? సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలా సోషల్ మీడియాకు ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కచ్చితంగా ఆలోచించాలి. సరిగ్గా ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే బయటపడుతున్నారు. పోనీ, వీరందరి వెనక ఉన్నది చంద్రబాబే అంటూ తమని తాము సమర్థించుకుంటే మాత్రం వైనాట్ 175 అనే టార్గెట్ రీచ్ కావడం వైసీపీకి కష్టసాధ్యమేనని చెప్పాలి. 

*

Tags:    
Advertisement

Similar News