16 నియోజకవర్గాల్లో రీపోలింగ్ కి వైసీపీ డిమాండ్

తాము రీ పోలింగ్‌ కోరుతున్న 60 బూత్ లకు సంబంధించి లైవ్‌ వెబ్‌ క్యాస్టింగ్‌ ఫుటేజీని బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు వైసీపీ నేతలు.

Advertisement
Update: 2024-05-24 01:41 GMT

ఏపీలో 16 నియోజకవర్గాల్లోని 60 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. ఈమేరకు వారు ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలసి వినతిపత్రం అందించారు. తగిన ఆధారాలు కూడా సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ రిగ్గింగ్ చేసినట్టు తగిన ఆధారాలున్నాయని, ఆయా కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలన్నారు. ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి సైతం వెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, మండలి విప్‌ లేళ్ల అప్పిరెడ్డి.. సీఈఓని కలసి ఫిర్యాదు చేశారు.

మాచర్లలో ఎన్నికల రోజు హింసాత్మక సంఘటనలు జరిగాయని, టీడీపీ రిగ్గింగ్ కి పాల్పడిందని.. దీనిపై ఎమ్మెల్యే పిన్నెల్లి అదే రోజు జిల్లా ఎస్పీకి పలు దఫాలు ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే ఫిర్యాదుల్ని ఎస్పీ బేఖాతరు చేశారని, టీడీపీకి అనుకూలంగాా ప్రవర్తించారని అన్నారు. ఎన్నికల ముందు పోలీస్‌ అధికారులను ఈసీ ఆకస్మికంగా బదిలీ చేయడంతో హింస చెలరేగిందని చెప్పారు. దీనికి బీజేపీ, టీడీపీ, ఈసీ పూర్తి బాధ్యత వహించాలన్నారు. టీడీపీ గూండాలు యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేసినా ఈసీ చర్యలు తీసుకోలేదన్నారు. 60 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలన్నారు.

తాము రీ పోలింగ్‌ కోరుతున్న 60 బూత్ లకు సంబంధించి లైవ్‌ వెబ్‌ క్యాస్టింగ్‌ ఫుటేజీని బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు వైసీపీ నేతలు. వీడియో ఫుటేజీల ఆధారంగా టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం పిన్నెల్లి వీడియోని మాత్రమే బయటపెట్టి వైసీపీపై బురదజల్లాలనుకోవడం సరికాదన్నారు. 

Tags:    
Advertisement

Similar News