బ్రహ్మణితో మొదలై JSW వరకు.. కడప ఉక్కు కథ ఇదే..!

ఒకే పరిశ్రమకు రెండుసార్లు శంకుస్థాపన చేయబోతున్నారంటూ జగన్ పై టీడీపీ అనుకూల మీడియా ఇప్పటికే సెటైర్లు పేలుస్తోంది. అయితే కంపెనీలు మారడంతో మరోసారి భూమిపూజ తప్పనిసరి అయింది.

Advertisement
Update: 2023-02-15 01:54 GMT

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి సీఎం జగన్ మరోసారి భూమిపూజ చేయబోతున్నారు. ఈ పరిశ్రమ నిర్మాణానికి JSW కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ రూ. 8,800 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది. తొలి విడతలో రూ.3,300 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తామంటున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి JSW గ్రూపు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ కూడా హాజరవుతారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె - పెద్ద దండ్లూరు గ్రామాల మధ్యలో దీన్ని స్థాపించబోతున్నారు.

బ్రహ్మణితో మొదలు..

కడప జిల్లాలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటుకు వైఎస్‌ఆర్ హయాంలోనే బీజం పడింది. 2007 జూన్‌ 10న జమ్మలమడుగు వద్ద 10,670 ఎకరాల్లో బ్రహ్మణి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఫ్యాక్టరీ పనులు ప్రారంభించిన తర్వాత గాలి జనార్దన్‌ రెడ్డి ఓబులాపురం అక్రమ మైనింగ్‌ కేసులో జైలుకి వెళ్లడంతో ఆ వ్యవహారానికి బ్రేక్ పడింది. వైఎస్ఆర్ మరణం తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ అంశం అటకెక్కింది. ఆ తర్వాత చంద్రబాబు 2018 డిసెంబరు 27న రాయలసీమ స్టీలు అథారిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరిట శంకుస్థాపన చేశారు. ప్రభుత్వమే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కానీ అదీ కుదరలేదు.

జగన్ హయాంలో రెండుసార్లు..

ఆ తర్వాత జగన్ హయాంలో ఏపీ హైగ్రేడ్‌ స్టీలు ప్లాంట్ అనే పేరు తెరపైకి వచ్చింది. 2019 డిసెంబరు 23న సీఎం హోదాలో జగన్ ఈ ప్లాంట్ కోసం శంకుస్థాపన చేశారు. రూ.15వేల కోట్ల పెట్టుబడితో 25వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కానీ అదీ కుదరలేదు. ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 22న సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో లిబర్టీ కంపెనీకి ఆమోదముద్ర వేశారు. కానీ ఆ సంస్థ కూడా తప్పుకుంది. ఆ తర్వాత ఎస్ఆర్ స్టీల్స్ తో ఒప్పందం కుదిరింది. అది కూడా ఫెయిలైంది. దీంతో ఇప్పుడు JSW తెరపైకి వచ్చింది. తాజాగా JSW కంపెనీ ప్రతినిధులతో కలసి మరోసారి భూమిపూజకోసం వస్తున్నారు సీఎం జగన్. ఒకే పరిశ్రమకు రెండుసార్లు శంకుస్థాపన చేయబోతున్నారంటూ జగన్ పై టీడీపీ అనుకూల మీడియా ఇప్పటికే సెటైర్లు పేలుస్తోంది. అయితే కంపెనీలు మారడంతో మరోసారి భూమిపూజ తప్పనిసరి అయింది.

Tags:    
Advertisement

Similar News