మొన్న రెండో వివాహం, నిన్న లైంగిక వేధింపులు..

ఈ కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అంటోంది అవినాష్ రెడ్డి వర్గం. సునీత టీడీపీతో కలసిపోయారని, అందుకే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు.

Advertisement
Update: 2023-04-12 00:07 GMT

వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆమధ్య సీబీఐ విచారణ తర్వాత కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. వివేకా రెండో వివాహాన్ని హైలెట్ చేశారు. ఆయన షేక్ మహ్మద్ అక్బర్ గా పేరు మార్చుకున్నారని, రెండో భార్య ద్వారా ఆయనకు షెహన్ షా అనే కొడుకు ఉన్నారని, ఆస్తి గొడవల వల్లే ఆయన్ను హత్య చేసి ఉంటారని చెప్పారు. కుటుంబం పరువుకోసమే తాను ఇంతకాలం ఆ నిజాన్ని దాచానన్నారు. తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వినిపించిన వాదనలు మరింత సంచలనంగా మారాయి. అసలీ హత్యకు కారణం లైంగిక వేధింపులేనని భాస్కర్ రెడ్డి న్యాయవాది కోర్టుకి తెలిపారు. ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ తల్లితో వివేకా అసభ్యంగా ప్రవర్తించేవారని, లైంగిక వేధింపులకు పాల్పడేవారని అందుకే ఆయన్ను హత్య చేసి ఉంటారని చెప్పారు. దీంతో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

టీడీపీ, సునీత, సీబీఐ..

ఈ కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అంటోంది అవినాష్ రెడ్డి వర్గం. వారికి మద్దతుగానే వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. సునీత టీడీపీతో కలసిపోయారని, అందుకే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. కావాలనే ఈ కేసులో అవినాష్ రెడ్డిని, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, భాస్కర్ రెడ్డిని నిందితుడిగా చేర్చకుండా సీబీఐని ఆదేశించాలంటూ ఆయన తరపు న్యాయవాది తెలంగాణ హైకోర్టుకి తెలిపారు. ఈరోజు దీనిపై మళ్లీ విచారణ కొనసాగుతుంది.

ఇక టీడీపీ కూడా ఈ వ్యవహారంపై కౌంటర్లు ఇస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు సంధిస్తోంది. వైఎస్ వివేకా హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోందని, కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. అసలు నిందితులెవరో తెలియకుండా కొత్త కథలు తెరపైకి తెస్తున్నారని, ప్రజల్లో లేనిపోని అనుమానాలు లేవనెత్తేలా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు.


మొత్తమ్మీద వైఎస్ వివేకా హత్యకేసుకి సంబంధించి కొత్త కొత్త విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఆయన హత్యకు అసలు కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా తేలడంలేదు. 

Tags:    
Advertisement

Similar News