ఇచ్చింది కండిషనల్‌ బెయిల్‌ మాత్రమే.. - టీడీపీ సంబరాలపై సజ్జల

చంద్రబాబు విప్లవకారుడా? స్వాతంత్య్ర ఉద్యమకారుడా? అని సజ్జల ప్రశ్నించారు. అలిపిరి ఘటన జరిగినప్పుడే ఆయన్ని ఎవరూ పట్టించుకోలేదని గుర్తుచేశారు.

Advertisement
Update: 2023-10-31 10:15 GMT

చంద్రబాబుకు కంటి చికిత్స నిమిత్తం న్యాయస్థానం కండిషనల్‌ బెయిల్‌ మంజూరు చేస్తే.. తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకోవడంలో అర్థం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందని ఆయన తెలిపారు. చంద్రబాబు మాజీ పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌ను విచారిస్తే అన్ని విషయాలూ బయటికి వస్తాయని చెప్పారు. మధ్యంతర బెయిల్‌ రాగానే నిజం గెలిచినట్టా అని సజ్జల ప్రశ్నించారు.

తాడేపల్లిలో మంగళవారం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బెయిల్‌ రాగానే నిజం గెలిచినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. చికిత్స చేయించుకోవడానికి మాత్రమే చంద్రబాబుకు బెయిల్‌ ఇచ్చారన్నారు. ఇది విజయోత్సవాలు జరపాల్సిన సందర్భమేనా? అని ప్రశ్నించారు. చిన్న వ్యాధిని కూడా పెద్దగా చూపించి.. సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు జైలులో ఉన్నా.. బయట ఉన్నా పెద్ద తేడా లేదని సజ్జల తెలిపారు.



చంద్రబాబు విప్లవకారుడా? స్వాతంత్య్ర ఉద్యమకారుడా? అని సజ్జల ప్రశ్నించారు. అలిపిరి ఘటన జరిగినప్పుడే ఆయన్ని ఎవరూ పట్టించుకోలేదని గుర్తుచేశారు. పేదలకు మంచి చేసి ఉంటే చంద్రబాబు కోసం కన్నీళ్లు కార్చేవారని, కానీ చంద్రబాబు జైలుకెళితే ఎవరూ బాధపడలేదని సజ్జల తెలిపారు. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్‌ చేస్తారని దుయ్యబట్టారు. స్కిల్‌ కేసులో డబ్బులు షెల్‌ కంపెనీలకు దారి మళ్లాయా? లేదా? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. సానుభూతి కోసం బెయిల్‌ తెచ్చుకుని.. జనాలకు చంద్రబాబు ఏం చెప్పాలనుకుంటున్నారని నిలదీశారు. నిజంగా చంద్రబాబు అనారోగ్యంగా ఉంటే చికిత్స చేయించుకోవాలని చెప్పారు. చికిత్స తర్వాత చంద్రబాబు జైలుకెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్దోషి అయితే ఆధారాలు బయటపెట్టాలని ఈ సందర్భంగా సజ్జల డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News