యార్లగడ్డ తప్పుచేస్తున్నారా?

వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో తానే పోటీ చేయబోతున్నట్లు యార్లగడ్డ ప్రకటించారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని తెలిపారు.

Advertisement
Update: 2023-07-25 06:02 GMT

తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురం నియోజకవర్గం మంటలు చల్లారకముందే కృష్ణా జిల్లాలోని గన్నవరంలో మంటలు మొదలయ్యాయి. వంశీకి వ్యతిరేకంగా దుట్టా, యార్లగడ్డ వర్గాలు సమావేశమయ్యాయి. రామచంద్రాపురం నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోసు ఎలాంటి తప్పు చేస్తున్నారో గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావు కూడా అదే తప్పు చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో గన్నవరంలో వల్లభనేని వంశీయే పోటీ చేస్తారని జగన్మోహన్ రెడ్డి చాలా కాలం క్రితమే ప్రకటించారు. అయితే అప్పటికే పార్టీలోని సీనియర్ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

పోయిన ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వంశీ తర్వాత పరిణామాల్లో జగన్‌కు దగ్గరయ్యారు. దాంతో వంశీనే అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. జగన్ ప్రకటనతో దుట్టా, యార్లగడ్డకు మండింది. వంశీ మీద కోపంతో దుట్టా, యార్లగడ్డ ఏకమయ్యారు. ఈ నేపథ్యంలో వంశీ-దుట్టా+యార్లగడ్డ వర్గాల మధ్య చాలా గొడవలయ్యాయి. చివరకు ఈ పంచాయితీ జగన్ దగ్గరకు చేరింది. అయితే జగన్ దగ్గర జరిగిన పంచాయితీలో యార్లగడ్డకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ పదవి ఇచ్చేట్లుగా ఒప్పందం జరిగింది.

ఒప్పందం ప్రకారం యార్లగడ్డను జగన్ డీసీసీబీ ఛైర్మన్‌గా నియమించారు. ఒకవైపు పదవి తీసుకుని మరోవైపు వంశీకి వ్యతిరేకంగా దుట్టాను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దాంతో పార్టీలోని రెండు వర్గాల మధ్య రెగ్యులర్‌గా గొడవలవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా యార్లగడ్డ+దుట్టా వర్గాలు సమావేశమయ్యాయి. రాబోయే ఎన్నికల్లో గన్నవరంలో పోటీ చేసే అంశంమీదే చర్చించాయి.

వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో తానే పోటీ చేయబోతున్నట్లు యార్లగడ్డ ప్రకటించారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని తెలిపారు. అంటే పిల్లి సుభాష్ చంద్రబోసు చేసిన ప్రకటనలాగే యార్లగడ్డ కూడా ప్రకటించినట్లు అర్థ‌మైపోతోంది. అక్కడేమో ఎమ్మెల్సీ రద్దవుతోందని రాజ్యసభ ఎంపీ పదవి తీసుకుని పిల్లి ఎదురు తిరిగారు. ఇక్కడేమో డీసీసీబీ ఛైర్మన్ పదవి తీసుకుని యార్లగడ్డ ఎదురు తిరుగుతున్నారు. మొత్తానికి గన్నవరం రిజల్ట్‌ ఎలా ఉంటుందో తెలియ‌దుకానీ యార్లగడ్డయితే తప్పు చేస్తున్నట్లే ఉన్నారు. మరి గన్నవరం పంచాయితీని జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News