చంద్రబాబు హామీలను వాలంటీర్లు నమ్ముతారా..?

వాలంటీర్లను ఇన్నిరకాలుగా అవమానించి, మానసికక్షోభకు గురిచేసిన చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ‌ను కంటిన్యూ చేస్తారని నమ్మేవాళ్ళు ఎవరు లేరు.

Advertisement
Update: 2024-03-05 05:40 GMT

చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారంటే నిలుపుకునేది అనుమానమే. ఎందుకంటే మాట నిలుపుకోవటంలో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ట్రాక్ రికార్డే కారణం. ఇప్పుడిదంతా ఎందుకంటే పెనుకొండ నియోజకవర్గంలో రా..కదలిరా బహిరంగసభ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వాలంటీర్లకు కొన్ని హామీలిచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఎవరినీ తీసేయరట. ఎవరి ఉద్యోగాలను తొలగించమని హామీఇచ్చారు. వాలంటీర్లను తొలగించే, తీసేసే ఆలోచనే తమకు లేదన్నారు. వాలంటీర్లందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

వాలంటీర్ల వ్యవస్ధను తప్పకుండా కంటిన్యూ చేస్తామన్నారు. వాలంటీర్లకు మంచి భవిష్యత్తుంటుందని భరోసా ఇచ్చారు. అయితే వాలంటీర్లు ఎవరూ వైసీపీకి పనిచేయకూడదని కండీషన్ పెట్టారు. చంద్రబాబు హామీతో వాలంటీర్లలో సంతోషం వెల్లివిరుస్తోందట. చంద్రబాబు తాజా హామీతో వాలంటీర్లలోని భయమంతాపోయిందని ఎల్లో మీడియా ఊదరగొట్టేస్తోంది. నిజానికి చూస్తే చంద్రబాబు ఇచ్చిన హామీని ఇచ్చినట్లుగా ఎప్పుడూ అమలుచేయలేదు. పైగా వాలంటీర్ల వ్యవస్థంటే చంద్రబాబుకు ఎంతమంటో అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ‌ను తీసుకొచ్చినప్పుడు వీళ్ళని ఎంతగా అవమానిస్తూ మాట్లాడారో అందరికీ తెలిసిందే.

వాలంటీర్లపై జనాలను రెచ్చగొట్టేందుకు చాలా ప్రయత్నాలుచేశారు. అయితే చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాలు పట్టించుకోలేదు. దాంతో చేసేదిలేక తాను మాట్లాడకుండా ఎల్లోమీడియాలో వ్యతిరేక కథనాలు వచ్చేట్లుగా ప్లాన్ చేశారు. దీనికీ జనాలు స్పందించలేదు. లోకేష్ తో కూడా వాలంటీర్లను బెదిరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వీళ్ళగురించి చాలా అభ్యంత‌ర‌క‌రంగా మాట్లాడారు. హ్యూమన్ ట్రాఫికింగుకు వాలంటీర్లే కారణమని పవన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తర్వాత కొందరు వాలంటీర్లు పవన్ పై పరువునష్టందావా వేశారు.

వాలంటీర్లను ఇన్నిరకాలుగా అవమానించి, మానసికక్షోభకు గురిచేసిన చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ‌ను కంటిన్యూ చేస్తారని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. అధికారంలోకి రాగానే వెంటనే వాలంటీర్లను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను నియమించటం ఖాయం. ఈ విషయాన్ని ఒకప్పుడు లోకేషే చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలుచేసినవి ఎన్నిఅని లెక్కలు తీస్తే చాలు చంద్రబాబు విశ్వసనీయత బయటపడుతుంది. హామీలిచ్చి మాటతప్పినవి ఎన్ని అని చూస్తే విషయం అందరికీ అర్థ‌మైపోతుంది. మరి వాలంటీర్లు ఏమిచేస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News