సుజనాకు షాకిచ్చిన జగన్.. విజయవాడ వెస్ట్ లో ప్లాన్-బి అమలు

సుజనా లోకల్ కాదు.. నేను లోకల్, ఆసిఫ్ లోకల్, సుజనా పేద ప్రజల మనిషి కాదు.. ప్రైవేట్ జెట్‌లలో తిరిగే వ్యక్తి అంటూ పోతిన మహేష్.. ఆసిఫ్ తరపున ప్రచారాన్ని హోరెత్తించారు. వైసీపీ ప్రచారంలో పోతిన మహేష్ ని ముందు వరుసలో నిలబెట్టడంతో ఇక్కడ సుజనాకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి.

Advertisement
Update: 2024-04-17 04:09 GMT

విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి బరిలో ఉన్నారు. ఇక్కడ ఆసిఫ్ అనే ఓ సామాన్య మైనార్టీ నాయకుడికి సీఎం జగన్ అవకాశమిచ్చారు. సుజనా ధనబలం ముందు ఆసిఫ్ ఓడిపోతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. జనసేన అసంతృప్త నేత పోతిన మహేష్ అనుకోకుండా వైసీపీలో చేరారు. ఇక చూస్కోండి సీన్ రివర్స్ అయింది. అప్పటి వరకు టఫ్ ఫైట్ అనుకున్న నియోజకవర్గం కాస్తా.. ఆసిఫ్ వైపు టర్న్ అయింది.

పోతిన మహేష్ నగరాల సామాజిక వర్గానికి చెందిన నేత. పోతిన వైసీపీ చేరికతో విజయవాడ వెస్ట్ లో నగరాల ఓటు బ్యాంక్ మొత్తం ఆయనతోపాటు వైసీపీవైపుకి వచ్చేసినట్టయింది. ఇక జనసేన తనను ఎలా అవమానించిందీ, పవన్ తనను ఎలా వాడుకుని వదిలేశారనే విషయాలను కూడా పోతిన హైలైట్ చేస్తూ ఆ పార్టీ పరువు తీస్తున్నారు. దీంతో వైసీపీకి క్రమక్రమంగా మరింత మద్దతు పెరుగుతోంది.

2019 ఎన్నికల్లో కూడా కొంతమంది సామాన్యులకు టికెట్లు ఇచ్చి ఆశ్చర్యపరచిన జగన్, ఈసారి కూడా కొన్ని నియోజకవర్గాల్లో అలాంటి ప్రయత్నమే చేశారు. విజయవాడ వెస్ట్ కూడా అందులో ఒకటి. సుజనాకు పోటీగా ఇక్కడ ఆసిఫ్ ని బరిలో దింపడం సాహసమనే చెప్పాలి. కానీ జగన్ మాస్టర్ ప్లాన్ ముందు సుజనా ఇప్పుడు విలవిల్లాడిపోతున్నారు. ఆసిఫ్ ప్రచారంతో సుజనాకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా పోతిన రాకతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ నుండి ఊడిపడిన సుజనా చౌదరి ఎప్పుడూ వార్డు మెంబర్‌గా కూడా పోటీ చేయలేదని ప్రచారంలో సెటైర్లు పేల్చారు పోతిన మహేష్. అవకాశాలు, కేసులను బట్టి సుజనా పార్టీ మారిపోయారని, బ్యాంకులను కొల్లగొట్టిన సుజనా చౌదరి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబడ్డారని ఎద్దేవా చేశారు. నగరాల ఆత్మ గౌరవం కోసం తాను సుజనాను వ్యతిరేకించానని చెప్పారు పోతిన మహేష్. నగరాలకు విజయవాడ మేయర్ పదవితోపాటు, దుర్గగుడి చైర్మన్, శ్రీశైలం లో 50సెంట్ల భూమి ఇచ్చి సీఎం జగన్ తమ వర్గానికి న్యాయం చేశారని అన్నారు. బీసీలకు గుర్తింపు ఇచ్చిన జగన్, నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. సుజనా లోకల్ కాదు.. నేను లోకల్, ఆసిఫ్ లోకల్, సుజనా పేద ప్రజల మనిషి కాదు.. ప్రైవేట్ జెట్‌లలో తిరిగే వ్యక్తి అంటూ పోతిన మహేష్ ఆసిఫ్ తరపున ప్రచారాన్ని హోరెత్తించారు. వైసీపీ ప్రచారంలో పోతిన మహేష్ ని ముందు వరుసలో నిలబెట్టడంతో ఇక్కడ సుజనాకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. 

Tags:    
Advertisement

Similar News