ఎమ్మెల్యేకోసం ఫ్లెక్సీ వేశారు.. ఆయనకు అది నచ్చలేదు

అయ్యగారు! మీకు మా నమస్కారాలు అంటూ మొదలు పెట్టి తమ సమస్యల చిట్టా విప్పారు. అయ్యా ఈ రోజైనా మా సమస్యలు విని గ్రామ ప్రజలకు సరైన వివరణ ఇస్తారని మా ఆశ.. అంటూ ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.

Advertisement
Update: 2023-02-10 14:40 GMT

రాజకీయ నాయకులు పర్యటనకు వస్తుంటే వారికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కడుతుంటారు అభిమానులు, స్థానికులు, పార్టీ కార్యకర్తలు. అలా కట్టిన ఓ ఫ్లెక్సీ ఆ నాయకుడికి నచ్చలేదు. కారణం అందులో స్వాగతంతోపాటు కొన్ని సమస్యలు కూడా ఏకరువు పెట్టారు. ఆ సమస్యలు ఎప్పుడు తీరుస్తారు బాబూ అంటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీలోని అధికార పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతికి ఎదురైన వింత అనుభవం ఇది.

గతంలో గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లాలోని బాపట్ల నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కోన రఘుపతి. నియోజకవర్గంలోని పిట్లవానిపాలెం మండలం వైసీపీకి కంచుకోట. అందులోనూ అదే మండలంలోని అల్లూరులో కోన రఘుపతికి మంచి పరపతి ఉంది. అదే అల్లూరు గ్రామస్తులు ఇప్పుడు కోనకి ఆహ్వానం పలుకుతూ వింత ఫ్లెక్సీ వేశారు.

అయ్యగారు! మీకు మా నమస్కారాలు అంటూ మొదలు పెట్టి తమ సమస్యల చిట్టా విప్పారు. “మీరు కొబ్బరికాయ గుర్తు మీద పోటీచేసినప్పటి నుంచి మూడుసార్లు పార్టీలకు అతీతంగా మీకు మద్దతు తెలిపాం. ఈ రోజు మా గ్రామానికి విచ్చేస్తున్న మీకు మా స్వాగతం. అయ్యా ఈ రోజైనా మా సమస్యలు విని గ్రామ ప్రజలకు సరైన వివరణ ఇస్తారని మా ఆశ” అంటూ ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.

అల్లూరు నత్తలవారిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చినా అది నెరవేర్చలేదని ప్రశ్నించారు. సచివాలయం, అంగన్వాడీ బిల్డింగ్ ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. నాలుగేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్న ఫ్లెక్సీలో ఉంచారు. నిరుపేదలకు పట్టాలివ్వలేదని, తమ గ్రామంలోని రోడ్డు రెవెన్యూ మ్యాప్ లోనే లేదని.. తమ సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలంటూ ఫ్లెక్సీ వేశారు గ్రామస్తులు.

ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లాల్సి ఉండగా సడన్ గా ఫ్లెక్సీ కనపడటంతో కలకలం రేగింది. చివరకు వైసీపీ నేతలు ఆ ఫ్లెక్సీని తొలగించారు. అయితే అది ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గడప గడపలో కొంతమంది ఎమ్మెల్యేలను సమస్యల జాబితాలు కూడా ఇలా పలకరిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News