860 కోట్ల విరాళం.. 8.24 లక్షలమందికి దర్శనం

శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం అంటూ వస్తున్న ఆరోపణల ద్వారా భక్తులు భగవంతునిపై నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని అన్నారు ఈవో ధర్మారెడ్డి. అసత్య ప్రచారాలు మానేయాలని హితవు పలికారు.

Advertisement
Update: 2023-06-22 09:00 GMT

శ్రీవాణి ట్రస్ట్ పై వస్తున్న వివాదాలకు టీటీడీ నుంచి వరుసగా వివరణలు వస్తున్నాయి. ఇటీవల టీటీడీ ఈవో వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇవ్వగా, తాజాగా ఈవో ధర్మారెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఇలాంటి ఆరోపణలతో భక్తుల నమ్మకాలకు భంగం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈవో ధర్మారెడ్డి. హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.

860కోట్లు..

శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ(SRIVANI) ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 860 కోట్ల రూపాయలను దాతలు సమర్పించారని తెలిపారు ఈవో ధర్మారెడ్డి. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని చెప్పారు. నిధులు ఇచ్చిన దాతలు 8,24,400 మంది శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనం చేసుకున్నారని వివరించారు. 2018లో శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభమైందని, గత నాలుగేళ్లుగా ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి రోజూ వెయ్యి మంది దర్శనం చేసుకుంటున్నారని చెప్పారు. అమరావతిలో రూ.150 కోట్లతో టీటీడీ ఆలయం నిర్మించడానికి విరాళాల సేకరణ కోసం ట్రస్టుని ప్రారంభించినట్లు తెలిపారు ఈవో.

అసత్య ప్రచారాలు వద్దు..

శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం అంటూ వస్తున్న ఆరోపణల ద్వారా భక్తులు భగవంతునిపై నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని అన్నారు ఈవో ధర్మారెడ్డి. అసత్య ప్రచారాలు మానేయాలని హితవు పలికారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని టీటీడీ సీరియస్ గా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే టీటీడీ చైర్మన్ హెచ్చరించారు. టీటీడీ వివరణలు ఇస్తున్నా.. ఏపీలో ప్రతిపక్షాలు మాత్రం శ్రీవాణి ట్రస్ట్ గురించి చర్చను ఆపేయలేదు. 

Tags:    
Advertisement

Similar News