ముద్రగడ పోటీ చేసేది ఇక్కడేనా?

రాబోయే ఎన్నికల్లో ముద్రగడ కాకినాడ ఎంపీగా పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యమ నేతను కాకినాడ ఎంపీగా పోటీ చేయించటం వల్ల మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ ప్రభావం ఉంటుందని అంచ‌నా వేస్తున్నాయి.

Advertisement
Update: 2023-07-10 06:13 GMT

గోదావరి జిల్లాల రాజకీయం మళ్ళీ ముద్రగడ పద్మనాభం చుట్టూ తిరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో ఆయ‌న‌ పోటీ చేయబోయే సీటేది? ఏ పార్టీ తరపున అనే చర్చలు పెరిగిపోతున్నాయి. నిజానికి ఏ నియోజకవర్గం అనే విషయంలో క్లారిటి లేకపోయినా పార్టీ మాత్రం వైసీపీనే అని తేలిపోయింది. ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తే అది వైసీపీ నుండి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే టీడీపీ, జనసేనలో ముద్రగడ చేరే అవకాశాలు దాదాపు లేవనేది అందరికీ తెలిసిందే.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. రాబోయే ఎన్నికల్లో ముద్రగడ కాకినాడ ఎంపీగా పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యమ నేతను కాకినాడ ఎంపీగా పోటీ చేయించటం వల్ల మొత్తం ఏడు నియోజకవర్గాల్లోనూ ప్రభావం ఉంటుందని అంచ‌నా వేస్తున్నాయి.పైగా సిట్టింగ్ ఎంపీ వంగా గీత మళ్ళీ ఎంపీగా పోటీ చేసే ఉద్దేశంలో లేరట. వచ్చే ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు పరిధిలోకి వచ్చే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్‌ చేసినట్లు పార్టీలో టాక్.

పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు మళ్ళీ టికెట్ ఇచ్చే ఉద్దేశంలో జగన్ కూడా లేరట. ఇప్పటివరకు జరిగిన సర్వేల్లో దొరబాబు మీద బాగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావటంతో ఇక్కడ ఎవరినైనా గట్టివాళ్ళని పోటీ చేయించాలని జగన్ ఇప్పటికే డిసైడ్ అయ్యారట. అభ్యర్థిని మార్చటం ఎలాగూ తప్పదు కాబట్టి ఆ టికెట్ తనకే ఇవ్వాలని గీత అడిగారని సమాచారం. ముద్రగడను కాకినాడ ఎంపీగాను, గీతను పిఠాపురం నుండి పోటీ చేయించటంలో జగన్‌కు ఇంకో సౌలభ్యం కూడా ఉంది.

అదేమిటంటే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముద్రగడ, గీత బాగా సన్నిహితులు. కాబట్టి వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ బాగుంటుంది. ఏ కోణంలో చూసినా వీళ్ళ కాంబినేషన్ బాగుంటుందని జగన్ కూడా అనుకుంటున్నారట. కాకపోతే ఎన్నికలకు ఇంకా పది మాసాల సమయం ఉంది కాబట్టి ఇప్పుడే ప్రకటన చేయాల్సిన అవసరంలేదని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పోటీ విషయమైతే చూచాయగా ముద్రగడకు చేరిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్యనే ముద్రగడ - జిల్లా ఇన్‌చార్జి, ఎంపీ మిథున్ రెడ్డి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఎన్నికల సమయానికి అన్నీ విషయాలు బయటకొస్తాయేమో.

Tags:    
Advertisement

Similar News