తారకరత్న గుడివాడ నుంచి పోటీ చేయాలని భావించారా? చంద్రబాబు స్పందన ఏంటి?

రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగాలనే ఆలోచన ఉండటం వల్లే కుప్పంలో యువగళం ప్రారంభ సభకు తారకరత్న వచ్చారు. కానీ, అనుకోకుండా అక్కడే గుండెపోటుకు గురయ్యారు.

Advertisement
Update: 2023-02-19 05:36 GMT

సినిమాల్లో అనుకున్న మేర రాణించలేక పోయిన నందమూరి తారకరత్న.. రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నారు. గత కొంత కాలంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన తారకరత్న.. తన మనసులోని మాటను టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు చెప్పినట్లు తెలుస్తున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు వారిద్దరితోనే కాకుండా, సన్నిహితులకు కూడా చెప్పారని.. ముఖ్యంగా గన్నవరం నుంచి పోటీకి రెడీగా ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం.

రాబోయే ఎన్నికల్లో బరిలోకి దిగాలనే ఆలోచన ఉండటం వల్లే కుప్పంలో యువగళం ప్రారంభ సభకు తారకరత్న వచ్చారు. కానీ, అనుకోకుండా అక్కడే గుండెపోటుకు గురయ్యారు. నటన నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకోకపోయినా.. టీడీపీ వ్యవహారాలపై మాత్రం ఆయన ఆసక్తిగానే ఉన్నారు. గన్నవరంలో టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా మారిన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.

గత ఎన్నికల్లో దేవినేని అవినాశ్‌ను విజయవాడ నుంచి గన్నవరానికి తీసుకొచ్చి బరిలోకి దింపినా.. నానిని ఓడించలేక పోయారు. ఎన్టీఆర్ అభిమానిని అని చెప్పుకుంటూనే టీడీపీ, చంద్రబాబు, లోకేశ్‌పై నిత్యం విమర్శలు చేసే నాని అంటే స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా కోపంతేనే ఉన్నారు. నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తినే గన్నవరం నుంచి బరిలోకి దింపితే నానిని ఓడించవచ్చని కొంత మంది చంద్రబాబుకు సలహా ఇచ్చారు.

నారా లోకేశ్ మంగళగిరి వదిలి గన్నవరం నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా జరిగింది. కానీ, ఈ సారి లోకేశ్‌కు మంచి సేఫ్ సెగ్మెంట్ వెదికే పనిలో చంద్రబాబు ఉన్నారు. అదే సమయంలో తారకరత్న తెరపైకి రావడమే కాకుండా.. తాను గన్నవరం నుంచి అయినా పోటీకి రెడీ అని చంద్రబాబుతో చెప్పారు.

అయితే, ఆఖరి నిమిషం వరకు టికెట్లు ఖరారు చేసే అలవాటు లేని చంద్రబాబు.. తారకరత్న విషయంలో కూడా నాన్చుడు ధోరణే ప్రదర్శించినట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. ముందు పార్టీ కోసం పని చేయాలని.. టికెట్ విషయం తర్వాత ఆలోచించవచ్చని చెప్పినట్లు సమాచారం. దీనిపై తారకరత్న కూడా కాస్త అసంతృప్తికి గురయ్యాడని.. ఆ తర్వాత గుంటూరులో పర్యటించినా టీడీపీ నుంచి సరైన సహకారం లభించలేదనే వార్తలు చక్కర్లు కొట్టాయి. చివరకు తారకరత్న తన రాజకీయ కెరీర్ కోరిక తీరకుండానే కన్నుమూయడం టీడీపీలో కూడా విషాదాన్ని నింపింది. 

Tags:    
Advertisement

Similar News