బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దు.. బాబుకి సుప్రీం హెచ్చరిక

సీఐడీ తరపు న్యాయవాదులు లోకేష్ పై ఆరోపణలు చేశారు. దర్యాప్తుకి భంగం కలిగేలా లోకేష్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. లోకేష్ బెదిరింపులకు సంబంధించి పలు ఆధారాలు కూడా సీఐడీ.. సుప్రీంకు సమర్పించింది.

Advertisement
Update: 2024-04-16 11:50 GMT

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని చంద్రబాబుకి సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీచేసింది. బాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంలో విచారణ జరిగింది. బెయిల్ షరతులను ఉల్లంఘించకూడదని చెబుతూ విచారణను మే-7కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుని గతంలో సీఐడీ అరెస్ట్ చేయగా ఆయన 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో గడిపారు. ఆ తర్వాత చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. కొన్ని రోజుల తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ ఇచ్చింది. ఏపీ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీఐడీ సవాల్‌ చేయగా ఆ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి.

తాజాగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీఐడీ తరపు న్యాయవాదులు లోకేష్ పై ఆరోపణలు చేశారు. దర్యాప్తుకి భంగం కలిగేలా లోకేష్ వ్యవహరిస్తున్నారని.. రెడ్‌బుక్‌లో అధికారుల పేర్లు రాసుకుంటున్నట్టు బెదిరిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అంతు చూస్తానని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారని కోర్టుకి తెలిపారు. లోకేష్ బెదిరింపులకు సంబంధించి పలు ఆధారాలు కూడా సుప్రీంకు సమర్పించింది సీఐడీ. బెయిల్ వచ్చింది చంద్రబాబుకు అయితే, కొడుకు మాటల్ని పరిగణలోకి తీసుకోవడం సరికాదని చంద్రబాబు తరపు లాయర్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. బెయిల్ షరతులు ఉల్లంఘించవద్దని చంద్రబాబుకి స్పష్టం చేసింది, కేసు విచారణను మే-7కు వాయిదా వేసింది. 

Tags:    
Advertisement

Similar News