జనసేన కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టా.. కానీ, పవన్ నుంచి ఫోన్ కూడా రాలేదు.. - షకలక శంకర్ షాకింగ్ కామెంట్స్

ఇంటికెళ్లాక జనసేన కోసం డబ్బు ఖర్చుపెట్టినట్లు చెబితే తన భార్య తనతో నాలుగు రోజులు మాట్లాడలేదని తెలిపాడు. ఈ విషయం తెలిసి తన మామయ్య కూడా బాధపడ్డారని చెప్పాడు.

Advertisement
Update: 2024-05-24 13:31 GMT

టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ అభిమానిగా పేరున్న కమెడియన్ షకలక శంకర్.. పవన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. జనసేన పార్టీ కోసం తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టానని.. కానీ, కనీసం పవన్ కళ్యాణ్ నుంచి తనకు ఒక ఫోన్ కాల్ కూడా రాలేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో జనసేన గెలుపు కోసం తాను కష్టపడి పనిచేసినట్లు చెప్పాడు. పార్టీ కోసం సొంత డబ్బు రూ.3 లక్షలు ఖర్చు పెట్టానన్నారు.

జనసేన కార్యక్రమాల్లో పాల్గొనే యువకుల దీన పరిస్థితిని చూసి వాళ్లకు భోజనాలు పెట్టించానన్నారు. సొంతూరికి బయలుదేరేముందు నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారని ఇంట్లో చెప్పానని, ఆ డబ్బు జనసేన కోసం ఖర్చుపెట్టి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఇంటికి బయలుదేరినట్లు చెప్పాడు. చివరికి డీజిల్ కోసం కూడా స్నేహితుడి వద్ద అప్పు చేయవలసి వచ్చిందన్నారు.

ఇంటికెళ్లాక జనసేన కోసం డబ్బు ఖర్చుపెట్టినట్లు చెబితే తన భార్య తనతో నాలుగు రోజులు మాట్లాడలేదని తెలిపాడు. ఈ విషయం తెలిసి తన మామయ్య కూడా బాధపడ్డారని చెప్పాడు. పవన్ కళ్యాణ్ కోసం ఇంత ఖర్చు పెట్టావని, కనీసం ఆయన నీకు ఏనాడైనా ఫోన్ చేశారా? అని ఆయన అడిగేసరికి తాను కూడా ఆయనకు సమాధానం చెప్పలేకపోయానన్నారు.

పవన్ కళ్యాణ్ నుంచి తానేదో ఆశించి జనసేన తరపున ప్రచారం చేయలేదని.. ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడంతో తనవంతుగా సాయం చేసినట్లు చెప్పాడు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో కూడా తాను జనసేన తరఫున ప్రచారం చేశానని షకలక శంకర్ వెల్లడించాడు.

అయితే తన వద్ద డబ్బు లేదన్న విషయాన్ని ముందే చెప్పేయడంతో పార్టీ తరఫున అన్ని ఖర్చులు వారే పెట్టుకున్నారని తెలిపాడు. జనసేన కోసం ప్రచారం చేసినందుకు తానేమీ అడగలేదని.. వారు కూడా తనకేమీ ఇవ్వలేదని షకలక శంకర్ వ్యాఖ్యానించాడు. కాగా, పవన్ కళ్యాణ్ గురించి, జనసేన గురించి షకలక శంకర్ చేసిన కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన కోసం ఖర్చు పెట్టుకున్న షకలక శంకర్ ను పవన్ ఆదుకుంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడగా.. మరి కొందరు మాత్రం ఎన్నికల ఖర్చు కోసం పవన్ తన వద్ద ఉన్న సొమ్మంతా ఖర్చు పెట్టారని.. అలాంటి వ్యక్తి నుంచి డబ్బు ఆశించడం బాగోలేదని అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News