పవన్ ఇంతగా భయపడుతున్నారా?

బీజేపీని చూసి పవన్ భయపడాల్సినంత అవసరం ఏమొచ్చింది? అనే విషయాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. పవన్‌ను బీజేపీ భయపెడుతోంది అని చెప్పిన పితాని ఏ విషయంలో బీజేపీ భయపెడుతోందో కూడా చెప్పుంటే బాగుండేది.

Advertisement
Update: 2023-04-21 05:26 GMT

‘జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బీజేపీ భయపెడుతోంది’ ఇది తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చేసిన వ్యాఖ్య. పితాని చేసిన వ్యాఖ్య లేదా ఆరోపణ పవన్‌ను ఉద్దేశించి చేశారో లేకపోతే బీజేపీని టార్గెట్ చేశారో స్పష్టతలేదు. అయితే పవన్‌ను భయపెట్టి కంట్రోల్లో ఉంచుకుంటోందనే విషయం పితాని మాటల్లో స్పష్టంగా బయటపడింది. కొంతకాలంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవటానికి పవన్ రెడీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పవనే స్వయంగా చెప్పారు.

టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ ప్రకటించినా, తమకు సహకరించకపోయినా బీజేపీ నేతలు పవన్‌ను గట్టిగా నిలదీయలేకపోతున్నారు. అలాగని బీజేపీతో కటీఫ్ చెప్పేసి టీడీపీతో పవన్ చేతులు కలిపారా అంటే అదీలేదు. ఎందుకనో టీడీపీతో చేతులు కలిపేందుకు పవన్ వెనకాడుతున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. పవనేమో టీడీపీని కూడా పొత్తులో తీసుకోవాలని ప్రయత్నిస్తుంటే అందుకు కమలం నేతలు అంగీకరించటంలేదు.

ఈ నేపథ్యంలోనే మిత్రపక్షాల పొత్తు ఎంతకాలం సాగుతుందో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఈ సమయంలోనే పవన్‌ను బీజేపీ భయపెడుతోందని చెప్పారు. టీడీపీతో పవన్‌ను కలవనీయకుండా వెనక్కులాగుతున్నట్లు కూడా ఆరోపించారు. ఇక్కడే పవన్‌పైన అందరిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏ విషయంలో పవన్‌ను బీజేపీ భయపెడుతోంది? బీజేపీ చేతిలో పవన్ జుట్టు ఇరుక్కునేంత సీక్రెట్ ఏముందో అర్థంకావటంలేదు.

బీజేపీని చూసి పవన్ భయపడాల్సినంత అవసరం ఏమొచ్చింది? అనే విషయాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. పవన్‌ను బీజేపీ భయపెడుతోంది అని చెప్పిన పితాని ఏ విషయంలో బీజేపీ భయపెడుతోందో కూడా చెప్పుంటే బాగుండేది. విషయాన్ని పూర్తిగా చెప్పకుండా సగం చెప్పి వదిలేయటంతో మిగితా సగం కోసం జనాలు బుర్రలకు పనిచెప్పారు. మామూలుగా అయితే మిత్రపక్షాలను బీజేపీ వదిలేయాల్సిందే. అలా కాకుండా ఏ పార్టీ అయినా బీజేపీని వదిలేస్తే దాని దుంపనాశనం చేసేంతవరకు బీజేపీ వదిలిపెట్టదు. అందుకనే బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలిగా రాజకీయాల్లో చెప్పుకునేది. మొత్తానికి ఏదో విషయంలో బీజేపీ చేతిలో పవన్ బాగా ఇరుక్కునట్లున్నారు. అందుకనే భయపడుతున్నారేమో.

Tags:    
Advertisement

Similar News