9వ సారి, 10వ సారి.. పోటీకి సై అంటున్న రాజకీయ కురువృద్ధులు

గెలుపోటములతో సంబంధం లేకుండా దశాబ్దాల తరబడి కొందరు నాయకులు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వరుసగా తొమ్మిదవ సారి, పదవ సారి పోటీ చేస్తూ ఇప్పటి తరం నాయకులకు సవాల్ విసురుతున్నారు.

Advertisement
Update: 2024-03-17 08:23 GMT

రాజకీయాల్లో దశాబ్దాల తరబడి రాణించడం అంటే అంత సులువేమి కాదు. ఎన్నికలంటేనే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఒకసారి ఓడిపోతే మళ్ళీ ఆర్థికంగా కోలుకోవడం కొంత కష్టమే. అలాంటిది గెలుపోటములతో సంబంధం లేకుండా దశాబ్దాల తరబడి కొందరు నాయకులు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వరుసగా తొమ్మిదవ సారి, పదవ సారి పోటీ చేస్తూ ఇప్పటి తరం నాయకులకు సవాల్ విసురుతున్నారు.

ఈసారి ఎన్నికల్లో 10వ‌ సారి పోటీ చేస్తున్న నాయకుల లిస్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(కుప్పం), మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు), తమ్మినేని సీతారాం(ఆముదాలవలస), అలాగే గొల్లపల్లి సూర్యరావు(రాజోలు) ఉన్నారు. వీరిలో చంద్రబాబు, పెద్దిరెడ్డి, సూర్యరావు వయస్సు 70 ఏళ్ల పై మాటే. తమ్మినేని కూడా 70కి దగ్గరలో ఉన్నారు.

ఇక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(కోవూరు), రాంభూపాల్ రెడ్డి(పాణ్యం), కోలగట్ల వీరభద్ర స్వామి(విజయనగరం), శెట్టిపల్లి రఘురామిరెడ్డి(మైదుకూరు), నంద్యాల వరదరాజుల రెడ్డి(ప్రొద్దుటూరు) 9వ‌ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో చాలామంది అభ్యర్థుల వయసు 60కి పైగానే ఉండగా..రఘురామిరెడ్డి, వరదరాజుల రెడ్డి వయసు 80 ఏళ్లకు పైగానే ఉంది.

టీడీపీ తరఫున రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్న బుచ్చయ్య చౌదరి వయసు కూడా 80కి దగ్గరలో ఉంది. ఆయన టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ తరఫున పనిచేస్తున్నారు. చిత్తూరు ఎంపీగా వైసీపీ తరపున పోటీ చేస్తున్న ఎన్. రెడ్డెప్ప వయసు 72 ఏళ్ళు. ఈ వయసులో కూడా వీరు ఉత్సాహంగా జనం మధ్య తిరుగుతున్నారు. ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. యువ నాయకులతో పోటీపడుతూ గెలుపు కోసం పోటీ పడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News