జూనియర్ల కోసం సీనియర్ల పట్టు..కారణమిదేనా?

ఒకవైపు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ప్యాకేజీలు సాధ్యంకాదని చెబుతున్నా తమ్ముళ్లు వినిపించుకోవటంలేదు. తమతో పాటు తమ వారసులను కూడా నియోజకవర్గాల్లో తిప్పేస్తున్నారు.

Advertisement
Update: 2023-04-20 06:22 GMT

రాబోయే ఎన్నికల్లో తమతో పాటు తమ వారసులకు కూడా టికెట్లు ఇప్పించుకోవాలని సీనియర్లు గట్టి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ప్యాకేజీలు సాధ్యంకాదని చెబుతున్నా తమ్ముళ్లు వినిపించుకోవటంలేదు. తమతో పాటు తమ వారసులను కూడా నియోజకవర్గాల్లో తిప్పేస్తున్నారు. దాంతో టికెట్లు ఆశిస్తున్న ఇతర తమ్ముళ్ళల్లో అయోమయం పెరిగిపోతోంది. తండ్రులు ఒక నియోజకవర్గంలో వారసులు మరో నియోజకవర్గంలో తిరుగుతుంటే క్యాడర్‌లో కూడా కన్ఫ్యూజన్ పెరిగిపోతోందట.

నర్సీపట్నం ఎమ్మెల్యేగా తనకు టికెట్ ఇవ్వటమే కాకుండా విశాఖపట్నం ఎంపీగా కొడుకు చింతకాయల విజయ్‌కు టికెట్ ఇవ్వాల్సిందే అని అయ్యన్నపాత్రుడు గట్టిగా పట్టుబట్టారట. దీంతో రాబోయే ఎన్నికల్లో పోటీకి మళ్ళీ రెడీ అవుతున్న భరత్‌లో అయోమయం పెరిగిపోతోంది. అలాగే, తునిలో త‌న కుమార్తె దివ్యకు టికెట్ ఇవ్వాల్సిందే అని సీనియర్ నేత రామకృష్ణుడు గట్టిగా చెబుతున్నారట. అయితే రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు టికెట్ తనకే కావాలని పట్టుగా ఉన్నారు.

ఎచ్చెర్లలో తనతో పాటు మరోచోట కొడుకు రాం మల్లిక్‌కు టికెట్ ఇవ్వాలని కిమిడి కళా వెంకట్రావు పదేపదే అడుగుతున్నారట. ఈ నేపథ్యంలోనే కళాను వచ్చే ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేయించే అవకాశం కూడా ఉందనే ప్రచారం మొదలైంది. ఇక గంటా శ్రీనివాసరావు కూడా కొడుకు గంటా రవితేజకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అశోక్ గజపతిరాజు కూడా తన కూతురు అదితి కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

అనంతపురంలో జేసీ బ్రదర్స్ అయితే తమ వారసులు జేసీ వపన్, జేసీ అస్మిత్‌కు టికెట్లు ఇవ్వాల్సిందే అని గట్టిగా చెబుతున్నారట. ఫ్యామిలీ ప్యాకేజీలు సాధ్యంకాదని ఒకవైపు చెబుతునే మరోవైపు రాప్తాడులో పరిటాల సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌కు టికెట్లు ప్రకటించారు. దాంతో తల్లి, కొడుకులను ఉదాహరణలుగా చూపించి చాలా నియోజకవర్గాల్లో సీనియర్లు చంద్రబాబుపై ఒత్తిడి పెంచేస్తున్నారట. కర్నూలులో భూమా, కేఈ కుటుంబాలు కూడా రెండేసి టికెట్లు అడుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో టికెట్ల తెచ్చుకుని గెలవకపోతే 2029 ఎన్నికలకు టీడీపీ పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థంకావటంలేదు. అందుకనే సీనియర్లందరూ జూనియర్ల కోసం చంద్రబాబుపై ఇంతగా ఒత్తిడి తెస్తున్నది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News