వైసీపీలో చేరిన సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే.. జనసేనకి షాక్

బలోపేతం అవుదామన్న ఆలోచన జనసేన నేతలకు ప్రస్తుతం లేదని విమర్శించారు. తనకు ప్రస్తుతం ఎక్కడి నుంచీ పోటీ చేసే ఆలోచన లేదని కూడా స్పష్టం చేశారు.

Advertisement
Update: 2023-05-11 05:31 GMT

సత్తెనపల్లిలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి తాజాగా వైసీపీలో చేరారు. తన కుమారుడు నితిన్‌ రెడ్డితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన.. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. అలానే సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్‌ పి. సూరిబాబు కూడా వైసీపీలో చేరారు.

సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో యర్రం వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ.. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసి ఓడిపోయారు. యర్రం వెంకటేశ్వరరెడ్డిని జనసేన వాడుకుని వదిలేసిందని మంత్రి అంబటి విమర్శించారు. తనను ఓడించాలని అప్పట్లో కుట్ర పన్ని కోడెల శివప్రసాద్, చంద్రబాబులతో కుమ్మక్కై అప్పటికప్పుడు నాదెండ్ల మనోహర్‌ జనసేన బీఫాం అతనికి ఇచ్చారని అంబటి రాంబాబు గుర్తుచేశారు.

పవన్ కళ్యాణ్, చంద్రబాబులు విడిపోయినట్లు నటించి మళ్లీ కలిశారని చెప్పుకొచ్చిన అంబటి రాంబాబు.. ఇప్పుడు మళ్లీ బేరాసారాలు చేస్తున్నారన్నారు. ఇదంతా చంద్రబాబు కోసమేనని ప్రజలు గమనించాలన్నారు. వెంకటేశ్వరరెడ్డి, సూరిబాబుల చేరికతో పల్నాడులో వైసీపీకి మరింత బలం చేకూరుతుంద‌ని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. బలోపేతం అవుదామన్న ఆలోచన జనసేన నేతలకు ప్రస్తుతం లేదని విమర్శించారు. తనకు ప్రస్తుతం ఎక్కడి నుంచీ పోటీ చేసే ఆలోచన లేదని కూడా స్పష్టం చేశారు. వైసీపీ అభ్యర్థుల గెలుపునకు తన వంతుగా పూర్తిగా సహకారం అందిస్తాన‌న్నారు. 

Tags:    
Advertisement

Similar News