ఏపీ ఉద్యోగులకు ఊరట.. కారణం ప్రభుత్వం కాదు, హైకోర్టు

ధర్నా నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ విద్యుత్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ధర్నాకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.

Advertisement
Update: 2023-09-01 11:37 GMT

ఏపీలో ఉద్యోగుల ధర్నాలు, ఆందోళనలు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్. అప్పటి వరకూ ఓ వెలుగు వెలిగిన ఆయన.. ఛలో విజయవాడ సక్సెస్ తర్వాత అజ్ఞాతవాసి అయ్యారు, అప్రాధాన్య పోస్ట్ లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత వచ్చిన డీజీపీ హయాంలో ఆందోళనలు, నిరసనలు అనేవి పూర్తిగా కనుమరుగయ్యాయి. ఉద్యోగుల ఆందోళనలు పోలీసులు కఠిన ఆంక్షలతో అటకెక్కాయి. ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లతో ఇటీవల కాలంలో నిరసనలకు చోటే లేకుండా పోయింది. దీంతో ఉద్యోగులు కోర్టు మెట్లెక్కారు. తమ హక్కుల్ని కాలరాస్తే ఎలా అని ప్రశ్నించారు. వారికి హైకోర్టులో ఊరట లభించింది. విద్యుత్ కార్మికుల ధర్నాకు ఈనెల 10న అనుమతి దొరికింది.

ధర్నా నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ విద్యుత్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ధర్నాకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈనెల 10న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30గంటలలోపు విజయవాడలో ధర్నా చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది.

సీపీఎస్ ఉద్యోగులకు మరో తేదీ..

అటు సీపీఎస్ రద్దు కోసం ఉద్యమం చేస్తున్నవారు కూడా సెప్టెంబర్-1న ధర్నాకు అనుమతి కోరుతూ కోర్టు మెట్లెక్కారు. వారికి కూడా కోర్టు షరతులతో అనుమతి ఇస్తామని తెలిపింది. అయితే సెప్టెంబర్-1 కాకుండా మరో తేదీ ఎంపిక చేసుకోవాలని చెప్పింది. విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు కనీసం వారం రోజుల గ్యాప్ ఉండేలా చూడాలని సూచించింది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. సీపీఎస్ ఉద్యోగులు విజయవాడలో 4 లక్షల మందితో తమ సత్తా చూపించాలనుకుంటున్నారు. షరతులతో అనుమతి ఇచ్చినా భారీ సంఖ్యలో తరలి వచ్చి తమ నిరసన తెలియజేయాలనే ప్లాన్ తో ఉన్నారు. ఒకరకంగా కోర్టు అనుమతి వారికి ఊరటనిచ్చినా, తేదీ మాత్రం ఖరారు కావాల్సి ఉంది. మొత్తమ్మీద పోలీసులు అనుమతి నిరాకరించడంతో కోర్టు మెట్లెక్కిన ఉద్యోగులకు అక్కడ ఊరట లభించిందనే చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News