మార్గదర్శికి షాకిచ్చిన ఆర్బీఐ..

కేసు సుప్రీంకోర్టులో ఉన్నా కూడా ఆర్బీఐ వ్యాఖ్యల నేపథ్యంలో తప్పు జరిగినట్టు రుజువైందని అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

Advertisement
Update: 2024-02-20 13:20 GMT

మార్గదర్శి అక్రమాలపై బాధితులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు, ఏపీ ప్రభుత్వం పోరాటం చేస్తోందే కానీ.. ఆర్బీఐ మాత్రం ప్రత్యక్షంగా రంగంలోకి దిగలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను పక్కనపెట్టి మార్గదర్శి డిపాజిట్లు సేకరించినా ఇన్నాళ్లూ కోర్టు కేసుల్లో ఆర్బీఐ తరపున ఎలాంటి స్పందన లేదు. కానీ తొలిసారిగా మార్గదర్శి ఫైనానిషియర్స్ కేసులో ఈరోజు ఆర్బీఐ నోరు విప్పింది. హిందూ అవిభాజ్య కుటుంబం పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ తరపు న్యాయనాది సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు కీలక మలుపు తిరిగినట్లయింది.

ప్రస్తుతం మార్గదర్శి వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి సంస్థ స్వీకరించింది. చిట్ ఫండ్ చట్టంలోని లొసుగుల్ని అడ్డుపెట్టుకుని ఈ కేసునుంచి బయటపడాలని చూస్తున్నారు రామోజీ. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం పట్టువిడవడంలేదు. గతంలో రూ.2600కోట్లు, తాజాగా మరో 2వేల కోట్ల రూపాయలను సైతం మార్గదర్శి డిపాజిట్ల రూపంలో సేకరించిందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 9న ఈ కేసులో సమగ్ర విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలియజేసింది.

ఆర్థిక నేరాలు రుజువైనట్టే..

కేసు సుప్రీంకోర్టులో ఉన్నా కూడా ఆర్బీఐ వ్యాఖ్యల నేపథ్యంలో తప్పు జరిగినట్టు రుజువైందని అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అక్రమ మార్గంలో మార్గదర్శి సంస్థ పెట్టుబడులు సేకరించిందని, ఆర్బీఐ వాదన దీన్ని రుజువు చేస్తోందని చెప్పారాయన. త్వరలో మార్గదర్శి వ్యవహారంలో తుది తీర్పు వస్తుందని, రామోజీ శిక్షార్హుడేనని ఉండవల్లి స్పష్టం చేశారు. 

Tags:    
Advertisement

Similar News