మా కౌలు తీసేశారు.. మా కారు తగలబెట్టారు

పక్కవాళ్లకి అనుకూలంగా మాట్లాడితే బంధుత్వాన్నే తెంచుకుంటామనే స్థాయికి వెళ్లిపోతున్నారు. గ్రామాల్లో కూడా రాజకీయాలు ఇరుగు పొరుగు మధ్య చిచ్చు పెట్టాయి.

Advertisement
Update: 2024-05-27 02:56 GMT

ఏపీలో ఎన్నికలు పూర్తయినా కూడా రాజకీయ ప్రతీకార జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. తమ పార్టీకి ఓటు వేయలేదనో, తమ తరపున ప్రచారం చేయలేదనో, వ్యతిరేక వర్గానికి మద్దతిచ్చారనో.. ఇలా రకరకాల కారణాలతో కొందర్ని ఇబ్బంది పెడుతున్నారు. మంగళగిరిలో టీడీపీకి ఓటు వేయలేదని కౌలు రైతుల్ని ఉన్నత వర్గాలు వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు.. ఈ ఏడాది పొలం కౌలుకు ఇవ్వడం కుదరదని చెప్పేశారట. కారణం, వారు వైసీపీకి ఓటు వేయడమేనని అంటున్నారు. ఏళ్ల తరబడి కౌలు చేసుకుంటున్నామని, ఈసారి మాత్రం రాజకీయాలు తమ పొట్ట కొట్టాయని వాపోతున్నారు కౌలు రైతులు.

నా కారు తగలబెట్టారు..

టీడీపీ, జనసేన నేతలు కూడా కొన్నిచోట్ల బాధితులుగా మారిన ఉదాహరణలున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారని అంటున్నారు జనసేన నాయకుడు కర్రి మహేష్. ఇంటిముందు ఉంచిన తన కారుని వారు తగలబెట్టారని ఆరోపించారు. ఆదివారం అర్థరాత్రి 2 గంటల తర్వాత వైసీపీ నేతలు కొందరు తమ ఇంటికి వచ్చి కారు తగలబెట్టారని, పవన్ కల్యాణ్ కోసం పనిచేస్తే ఇలా ఆస్తులు ధ్వంసం చేస్తారా అంటూ వాపోయారు మహేష్. పోలీసుల దర్యాప్తు మొదలు పెట్టారు.

దాదాపు రాష్ట్రమంతా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ సారి ఎన్నికలను ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. తమతో ఉండేవారే తమవారు, లేదంటే పరాయివారు అంటూ పక్క పార్టీకి ప్రచారం చేసిన సొంత కుటుంబ సభ్యుడిపైనే నాగబాబు మాటల దాడికి దిగడం చూస్తూనే ఉన్నాం. కుటుంబాల్లోనే రాజకీయాలు ఇలా చిచ్చు పెట్టాయి, పక్కవాళ్లకి అనుకూలంగా మాట్లాడితే బంధుత్వాన్నే తెంచుకుంటామనే స్థాయికి వెళ్లిపోతున్నారు. ఇటు గ్రామాల్లో కూడా రాజకీయాలు ఇరుగు పొరుగు మధ్య చిచ్చు పెట్టడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News