ఏపీలో గన్నవరం హీట్.. చింతమనేని వర్సెస్ వల్లభనేని

గన్నవరంలో ఎవరైనా పోటీ చేయొచ్చని.. స్వయంగా చంద్రబాబు, లోకేష్ పోటీ చేసినా తనకు ఇబ్బంది లేదన్నారు వంశీ.

Advertisement
Update: 2023-04-21 07:57 GMT

చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో హడావిడి చేశారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం 10మందికి పైగా పోటీ పడుతున్నారని చెప్పారు. పార్టీ మారిన వల్లభనేని వంశీపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. "ముందు వాడి ఊరిలో వాడిని చూసుకోమనండి.. బకెట్‌ జారిన వాళ్లు, అడుగు జారిన వెధవలంతా నానికి, నాకు చెబుతున్నారు. మంగమ్మ శపథాలు చేస్తున్నారు." అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటిలేటర్ పై ఉంది ఎవరు..?

ఏపీలో వైసీపీ వెంటిలేటర్ పై ఉందంటూ.. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు వల్లభనేని వంశీ. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి, అందులో నలుగురు బయటకు పోయిన టీడీపీ వెంటిలేటర్ మీద ఉందా? లేక 151 మందిని గెలిపించుకున్న వైసీపీ వెంటిలేటర్ పైన ఉందా? అని ప్రశ్నించారు. పోయే కాలం వచ్చిన వాళ్లంతా.. వాళ్లు పోయారు, వీళ్లు పోయారు అంటూ అరుస్తుంటారని ఎద్దేవా చేశారు.

దమ్ముంటే గ‌న్న‌వ‌రానికి రండి..

గన్నవరంలో ఎవరైనా పోటీ చేయొచ్చని.. స్వయంగా చంద్రబాబు, లోకేష్ పోటీ చేసినా తనకు ఇబ్బంది లేదన్నారు వంశీ. చంద్రబాబు, లోకేష్ కి గన్నవరంలో పోటీకి రావాలంటూ తాను చాలా సార్లు సవాల్ విసిరానని చెప్పారు. ఎవరిని పోటీకి నిలబెట్టినా టీడీపీకి ఉపయోగం లేదన్నారు.

గన్నవరంలో టీడీపీ తరపున బలమైన అభ్యర్థిని నిలబెడతామంటూ చింతమనేని ప్రభాకర్ అక్కడి కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈసారి మీసం మెలేసే వారిని తీసుకొస్తామన్నారు. దీంతో వంశీ వెంటనే రియాక్ట్ అయ్యారు. ముందు చింతమనేని తన సంగతి తాను చూసుకోవాలంటూ హితవు పలికారు.

Tags:    
Advertisement

Similar News