జగన్‌నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?

మోడీ, అమిత్ షా త‌న‌కు అత్యంత సన్నిహితులన్న విషయం మరచిపోవద్దని జగన్‌కు ప‌వ‌న్‌ వార్నింగ్ ఇచ్చారు. తనతో పెట్టుకుంటే అంతే సంగతులని హెచ్చ‌రించారు.

Advertisement
Update: 2023-07-01 07:39 GMT

భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాదాపు రెండు గంటలు మాట్లాడారు. ప్రసంగం అంతా విన్నతర్వాత ఏమి మాట్లాడారంటే ఏమో అనే అనుకోవాలి. ఎందుకంటే వారాహియాత్ర మొదలైన దగ్గర నుండి కానీ అంతకుముందు కానీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిందే ఇప్పుడు కూడా మాట్లాడారు. టార్గెట్ జగన్..జగన్ అంతే మరొకటి ఉండదు కదా. ఎవరో ఇంగ్లీషు రచయితల పేర్లు చెప్పారు, వాళ్ళ కోట్ లు చెప్పారు. మాటకు ముందు.. మాట‌కు తర్వాత చెగువేరా ప్రస్తావన తెచ్చారు.

గుంటూరు శేషేంద్రశర్మన్నారు, పుచ్చలపల్లి సుందరయ్యన్నారు.. మొత్తంమీద జనాలకు ఏమిచెప్పారయ్యా అంటే అర్థంకాదు. థియేటర్లో కొన్నిసినిమాలు చూస్తున్నప్పుడు పాటలు బాగున్నాయనిపిస్తుంది. థియేటర్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత పాట గుర్తుండదు. పవన్ భీమవరం స్పీచ్ కూడా అలాగే ఉంది. అందరికీ అర్థ‌మైనది ఏమిటంటే జగన్‌ను పవన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని. ఎలాగంటే జగన్ చరిత్ర సమస్తం పవన్ దగ్గరుందట.

హైదరాబాద్‌లో జగన్ చదువుకునే రోజుల్లో ఏమి చేసింది అనే విషయాల నుంచి ఇప్పటివరకు ప్రతి క్షణం ఏమేమి చేస్తున్నారనే వివరాలు తన దగ్గరున్నట్లు చెప్పారు. ఇంటెలిజెన్స్ వర్గాలు తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాయట. ఆ వివరాలను తానుగనుక చెబితే జగన్ చెవుల్లో నుండి రక్తం కారిపోతుందట. ఎక్కడెక్కడ ఎంతెంత సంపాదిస్తున్నది, గంజాయి సంపాదన వివరాలు కూడా తన దగ్గరున్నట్లు చెప్పారు. జగన్ వ్యవహారం మొత్తం కేంద్ర హోంశాఖ దగ్గర భద్రంగా ఉందట. ఆ మధ్య నరేంద్ర మోడీ వైజాగ్ పర్యటనలో కలిసిన‌ప్పుడే జగన్ గురించి ఫిర్యాదు చేయటానికి రెడీ అయ్యారట. అయితే చివరి నిమిషంలో ఎందుకని ఆగిపోయారట.

తనకు మోడీ, అమిత్ షా అత్యంత సన్నిహితులన్న విషయం మరచిపోవద్దని జగన్‌కు వార్నింగిచ్చారు. తనతో పెట్టుకుంటే అంతే సంగతులన్నారు. నిజంగానే అంత సన్నిహితమైతే గడచిన నాలుగేళ్ళుగా అపాయిట్మెంట్ అడుగుతున్నా ఎందుకు ఇవ్వటంలేదో. చాలా సార్లు ఢిల్లీకి వెళ్ళి రెండు మూడు రోజులు పడిగాపులు కాసి చివరకు వెనక్కొచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ ఏ రేంజ్‌లో చెప్పారంటే తానుగాని ఒక ఈలగాని వేస్తే అని సినిమాలో చెప్పినట్లుగా చెప్పారు. మోడీకి తాను ఫిర్యాదు చేస్తే ఉద్యోగం ఊడిపోతుంది జాగ్రత్త అని జగన్‌ను హెచ్చరించారు. భీమవరం మీటింగులో ఏదో చెబుతారని అనుకుంటే ఇంకేదో చెప్పి ముగించేశారు.

Tags:    
Advertisement

Similar News