జాతీయ రహదారిపై అడ్డంగా పడుకున్న‌ పవన్

పోలీసులు అడ్డుకోవడంతో ఏకంగా జాతీయ రహదారిపై పడుకొని నిరసన తెలిపారు. పోలీసులు చాలాసేపు బతిమిలాడిన తర్వాత తిరిగి కారు ఎక్కారు.

Advertisement
Update: 2023-09-10 01:54 GMT

చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ హైడ్రామా సృష్టించారు. చంద్రబాబు నాయుడుని కలవడానికి తొలుత హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. కానీ, శాంతిభద్రతల దృష్ట్యా పవన్ విమానానికి అనుమతులు ఇవ్వద్దని కృష్ణా జిల్లా ఎస్పీ గన్నవరం ఎయిర్ పోర్ట్ అధికారులకు లేఖ రాశారు. దాంతో విమాన ప్రయాణానికి అనుమతులు లభించలేదు.

పవన్ రోడ్డు మార్గంలో విజయవాడకు బయల్దేరారు. ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. వెనక్కు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ, పవన్ మాత్రం లెక్క చేయలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏపీకి వెళ్లాలంటే వీసా కావాలా అని ప్రశ్నించారు. పవన్ కారుని ఆపడంతో హైవేపై కోదాడ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాంతో గరికపాటి వద్ద పవన్ కాన్వాయ్‌ని వదిలేసిన పోలీసులు అనుమంచిపల్లి వద్ద మరోసారి అడ్డుకున్నారు. దాంతో పవన్ కారు దిగి నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించారు.

పోలీసులు అడ్డుకోవడంతో ఏకంగా జాతీయ రహదారిపై పడుకొని నిరసన తెలిపారు. పోలీసులు చాలాసేపు బతిమిలాడిన తర్వాత తిరిగి కారు ఎక్కారు. ఇంతలో భారీగా జనసేన కార్యకర్తలు అక్కడికి రావడంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన పోలీసులు పవన్‌ను ఏపీలోకి అనుమతించారు. అయితే పోలీసులు దగ్గరుండి పవన్ ను మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద వదిలిపెట్టారు. పవన్ వీలు చూసుకొని చంద్రబాబు నాయుడుని కలిసేందుకు సిద్ధమవుతున్నారు.

Tags:    
Advertisement

Similar News