ఆడుదాం ఆంధ్రా అంటే ఇదేనా..? విహారికి మద్దతుగా పవన్ ప్రెస్ నోట్

ఈ వ్యవహారాన్ని రాజకీయాలకు ముడిపెట్టడమే పెద్ద తప్పు. కానీ బురదజల్లేందుకు రెడీగా ఉన్న ఎల్లో మీడియాకి పవన్ కూడా జతకలిశారు, ఈ వ్యవహారాన్నంతా వైసీపీకి ముడిపెడుతూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

Advertisement
Update: 2024-02-27 10:36 GMT

ఏపీ రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్ గా హనుమ విహారిని తొలగించడం, దాన్ని అవమానంగా భావించి ఆయన ఏకంగా జట్టుకే గుడ్ బై చెప్పడం.. ఈ వరుస సంఘటనలు ఏపీలో రాజకీయ సంచలనంగా మారాయి. హనుమ విహారి ఏం చేశారు..? ఆయన్ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎందుకు కెప్టెన్సీ నుంచి తొలగించింది అనే వివరాలేవీ పూర్తి స్థాయిలో బయటకు రాకుండానే రాజకీయ నాయకులు ఆ తప్పిదాన్ని వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.


గతంలో గాయాలు లెక్కచేయకుండా విహారి భారత జట్టు కోసం ఆడారని, ఏపీ జట్టు కోసం తన శక్తినంతా ధారపోశారని తన ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు పవన్ కల్యాణ్. ఏపీ రంజీ జట్టు నాకౌట్‌ కి చేరడంలో అతనిది కీలక పాత్ర అని అన్నారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ కు భారత క్రికెటర్ కంటే.. వైసీపీ నాయకుడే ముఖ్యమా అని తన ప్రెస్ నోట్ లో ప్రశ్నించారు పవన్. అయితే విహారి ఆట తీరుని ఇక్కడెవరూ శంకించలేదు. ఆయన తోటి క్రీడాకారుడితో ప్రవర్తించిన తీరు సరిగా లేదనేదే ప్రధాన ఆరోపణ. అందులోనూ.. కెప్టెన్ గా అతడిని తప్పించడానికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు. అతడు పూర్తి స్థాయిలో జట్టుకి అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడం వల్లే కొత్త కెప్టెన్ ని తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. ఈ దశలో ఈ వ్యవహారాన్ని రాజకీయాలకు ముడిపెట్టడమే పెద్ద తప్పు. కానీ బురదజల్లేందుకు రెడీగా ఉన్న ఎల్లో మీడియాకి పవన్ కూడా జతకలిశారు, ఈ వ్యవహారాన్నంతా వైసీపీకి ముడిపెడుతూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.


రంజీ జట్టు కెప్టెన్ గా హనుమ విహారిని తొలగించడానికి, ఏపీలో జరిగిన ఆడుదాం ఆంధ్రా పోటీలకు ఏమైనా పోలిక ఉందా..? కానీ వైసీపీ వైరి వర్గం మాత్రం.. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ఈ వ్యవహారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ఆడుదాం ఆంధ్రాకోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లాభమేంటని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ఆటగాళ్లను గౌరవించడం తెలిసిన స్టేట్ క్రికెట్‌ అసోసియేషన్‌తో విహారి వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరఫున ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా ఇదే వ్యవహారంపై ట్విట్టర్లో స్పందించారు. ఆడుదాం ఆంధ్ర అంటూ 2 నెలలు సినిమా స్టంట్స్ చేయించిన వైసీపీ నేతలు, అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? అని ప్రశ్నించారామె. ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల.

Tags:    
Advertisement

Similar News