నేను అసెంబ్లీకి వెళ్లి ఉంటే లక్ష ఉద్యోగాలు తెచ్చేవాడిని..

తాను ప్రజల తరపున పోరాటం చేస్తానని, జనసేనను బలపరచాలని కోరారు. కోనసీమ నుంచి కడప దాకా అందరికీ తాను అండగా ఉంటానన్నారు పవన్.

Advertisement
Update: 2023-06-22 17:28 GMT

2019లో ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి జనసేనను గెలిపించి, తనను అసెంబ్లీకి పంపించి ఉంటే కనీసం లక్ష ఉద్యోగాలకోసం కొట్లాడేవాడినని, సాధించేవాడినని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. అమలాపురం సభలో మాట్లాడిన పవన్.. మరోసారి వైసీపీ పాలనపై ధ్వజమెత్తారు. వైసీపీ చివరకు గుడిలో చెప్పులు కూడా ఎత్తుకుపోతోందని సెటైర్లు పేల్చారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టేందుకు అంత గొడవ జరగాలా అని ప్రశ్నించారు పవన్. దాదాపు 250మందిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. గొడవల్ని నిలువరించేవాడే నాయకుడు.. సృష్టించేవాడు కాదని చెప్పారు పవన్.

ఒక్క అవకాశం ఇవ్వండని అడిగిన జగన్ దళిత సంక్షేమ పథకాలన్నీ తీసేశారని విమర్శించారు పవన్. అద్భుతాలు చేస్తామన్న ఆయన కనీసం సీపీఎస్‌ ని రద్దు చేయలేకపోయారని జీపీఎస్ అంటూ కొత్త నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. 175కు 175 కొట్టేస్తామని, ఒక్క సీటుకూడా నిలబెట్టుకోలేని పార్టీ జనసేన అంటూ వెటకారం చేస్తున్నారని.. 175 గెలిచేంత సీన్ ఉంటే వారాహి రోడ్డుపైకి వస్తేనే అంత భయపడిపోవాలా అని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాల్లో కమీషన్లు వసూళ్లు చేస్తున్నారని, సంపూర్ణ మద్యనిషేధం హామీని జగన్ పట్టించుకోవట్లేదని, గంజాయి మత్తులో యువతను ముంచేస్తున్నారని విమర్శించారు పవన్. అమలాపురంలో ఆక్వా పొల్యూషన్‌ వల్ల రోగాలు వస్తున్నాయని చెప్పారు, కనీసం ఇక్కడ సరైన ఆస్పత్రి కూడా లేదన్నారు.


ముఖ్యమంత్రిని మనం తిట్టాల్సిన పనిలేదని, వైసీపీకి ఓటు వేయకుండా ఉంటే చాలని చెప్పారు పవన్ కల్యాణ్. తాను ప్రజల తరపున పోరాటం చేస్తానని, జనసేనను బలపరచాలని కోరారు. కోనసీమ నుంచి కడప దాకా అందరికీ తాను అండగా ఉంటానన్నారు పవన్. విద్య, వైద్యం సంపూర్ణంగా అందరికీ అందేలా కృషిచేస్తానన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చేయిస్తామన్నారు.

ఇవీ పవన్ కొత్త స్లోగన్లు..

అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి..

అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి..

జనం బాగుండాలంటే జగన్‌ పోవాలి..

హలో ఏపీ.. బైబై వైసీపీ... అంటూ జనసైనికుల్ని ఉత్సాహపరుస్తూ ప్రసంగం ముగించారు పవన్.

Tags:    
Advertisement

Similar News