పొత్తు ఖాయం.. తేల్చేసిన పవన్ కల్యాణ్

త్వరలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి సమష్టిగా ముందుకెళ్తామన్నారు పవన్. జనసేన, టీడీపీ శ్రేణులతో కలసి కూర్చుని మాట్లాడతామని, ముందస్తుగా ప్రజలకు భరోసా కల్పించేందుకు రెండు పార్టీలు పొత్తులోకి వెళ్తున్నాయని చెప్పారు పవన్.

Advertisement
Update: 2023-09-14 08:04 GMT

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలసి వెళ్తాయని తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని పరామర్శించిన అనంతరం నారా లోకేష్, బాలకృష్ణతో కలసి మీడియాతో మాట్లాడారు పవన్. వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసే వెళ్తాయన్నారు. ఇది టీడీపీ, జనసేన భవిష్యత్తు కోసం కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని అన్నారు. ఇవాళ్టి ములాఖత్‌ ఆంధ్రప్రదేశ్‌ కు చాలా కీలకమైనదని అన్నారు.

ఎవ్వర్నీ వదిలిపెట్టను..

రాళ్లు వేసిన ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతలు మాపై రాళ్లు వేసేముందే ఆలోచించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు బాగుండాలనేదే తన ఆకాంక్ష అన్నారు. సైబరాబాద్‌ నిర్మించిన వ్యక్తిని జైలులో పెట్టడం బాధాకరం అని చెప్పారు. వైసీపీని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని చెప్పారు పవన్.


Full View

చంద్రబాబుతో పాలన, విధానపరమైన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ గత నాలుగున్నరేళ్లుగా జగన్ అరాచక పాలన చూసి విసిగిపోయానన్నారు పవన్. ఈ అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని, చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించేందుకే తాను ములాఖత్ కు వచ్చానన్నారు. తాను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే వ్యక్తిని కాదన్నారు. జగన్ కి 6 నెలలు మాత్రమే టైమ్ ఉందని, ఆ తర్వాత ఆయన మద్దతుదారులకు యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. ఈలోపు తప్పు సరిదిద్దుకుంటే సరేనని, లేకపోతే సివిల్ వార్ కి తాము కూడా సిద్ధమేనన్నారు. ఏ ఒక్కర్నీ వదిలిపెట్టనన్నారు పవన్.

త్వరలో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి సమష్టిగా ముందుకెళ్తామన్నారు పవన్. జనసేన, టీడీపీ శ్రేణులతో కలసి కూర్చుని మాట్లాడతామని, ముందస్తుగా ప్రజలకు భరోసా కల్పించేందుకు రెండు పార్టీలు పొత్తులోకి వెళ్తున్నాయని చెప్పారు పవన్. ఐక్య కార్యాచరణ మొదలు పెడతామని చెప్పారు. పోటీ, సీట్లు, సర్దుబాట్లు.. అవన్నీ తర్వాతి విషయం అన్నారు పవన్. 

Tags:    
Advertisement

Similar News