చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ పొత్తు సెగ

చంద్రబాబు ఏకపక్షంగా సీట్లను ప్రకటించినందుకు పవన్‌ తన పార్టీ నేతలకు క్షమాపణలు చెప్పారు. దీన్నిబట్టి చంద్రబాబు కారణంగా పవన్‌ కల్యాణ్‌ భవిష్యత్తులు ఎన్ని క్షమాపణలు చెప్పుకోవాల్సిందో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement
Update: 2024-01-26 07:47 GMT

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని విస్మరించారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గుర్రుమన్నారు. చంద్రబాబు ఏకపక్షంగా టిడిపి సీట్లను ప్రకటించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం ప్రకారం టిడిపి సీట్లు ప్రకటించకూడదని ఆయన అన్నారు. మిత్రపక్షం జనసేనను సంప్రదించకుండా టిడిపి ఏకపక్షంగా సీట్లను ప్రకటించడం పవన్‌ కల్యాణ్‌కు మింగుడు పడడం లేదు. తద్వారా భవిష్యత్తులో పవన్‌ కల్యాణ్‌ ఏ విధమైన చేదు అనుభవాలను రుచి చూడాల్సి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా తన అసలు నైజాన్ని చంద్రబాబు ప్రదర్శించారని చెప్పాలి. జనసేన తమ నుంచి దూరం జరగదనే ధీమా కలిగిన తర్వాతనే చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌పై ఓ పాచిక విసిరారు.

చంద్రబాబు ఏకపక్షంగా సీట్లను ప్రకటించినందుకు పవన్‌ తన పార్టీ నేతలకు క్షమాపణలు చెప్పారు. దీన్నిబట్టి చంద్రబాబు కారణంగా పవన్‌ కల్యాణ్‌ భవిష్యత్తులు ఎన్ని క్షమాపణలు చెప్పుకోవాల్సిందో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఏకపక్ష ధోరణిపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై కూడా ఆగ్రహంతో ఉన్నట్లు అర్థమవుతున్నది. లోకేష్‌ ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడినప్పటికీ తాను పట్టించుకోలేదని పవన్‌ తన పాత పుండును ఓసారి కెలుక్కున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాను మౌనంగా ఉంటున్నానని ఆయన అన్నారు. దీన్ని బట్టి టిడీపి తీరుపై పవన్‌ కల్యాణ్‌ ఎంత వేదన చెందుతున్నారో తెలిసిపోతూనే ఉన్నది. పొత్తును ఇబ్బందులకు గురి చేసేలా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని, జగన్‌ తిరిగి అధికారంలోకి రాకూడదనేదే తన అభిమతమని ఆయన అన్నారు. జగన్‌ను గద్దె దించడానికి చంద్రబాబు నుంచి, ఆయన ముద్దుల తనయుడు నారా లోకేష్‌ నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా భరించడానికి పవన్‌ కల్యాణ్‌ సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్న తలెత్తుతున్నది.

చంద్రబాబును నమ్ముకుంటే పుట్టి మునుగుతుందనే విషయం పవన్‌ కల్యాణ్‌కు పూర్తిగా అర్థమైనట్లు లేదు. చంద్రబాబు తెప్పను తగిలేసే రకమని గత సంఘటనలను గమనంలోకి తెచ్చుకుంటే అర్థమవుతుంది. గతంలో తన కుటుంబ సభ్యులను కూడా చంద్రబాబు వాడుకుని వదిలేశారు. అలాగే పవన్‌ కల్యాణ్‌ను కూడా వాడుకుని వదిలేస్తారని చెప్పడానికి గతంలోని సంఘటనలను ఏకరువు పెట్టాల్సిన అవసరం లేదు.

Tags:    
Advertisement

Similar News