పొత్తుపై ఎక్కడో తేడా కొడుతోంది.. లోకేష్ మాటలే నిదర్శనం

ఒకవేళ ఎన్నికల్లో కూటమి పోటీ చేసినా ఓట్ ట్రాన్స్ ఫర్ మాత్రం నూటికి నూరు శాతం ఈ రెండు పార్టీల మధ్య సాధ్యం కాకపోవచ్చు. అందుకే అధినేతలు ఇంతలా బాధపడుతున్నారు.

Advertisement
Update: 2024-02-12 01:07 GMT

ఏపీ ప్రజలు, ముఖ్యంగా టీడీపీ, జనసేన శ్రేణులు.. ఆ రెండు పార్టీల పొత్తుని ఒప్పుకోవడం లేదా..? పొత్తుల వల్ల ఒరిగేదేమీ లేదని ఎవరికి వారు తీర్మానించుకుంటున్నారా..? పైకి నవ్వుతూ కనపడుతున్నా లోలోపల కత్తులు నూరుతున్నారా..? అసలీ పొత్తు ఎన్నికల్లో సక్సెస్ అవుతుందా..? వీటిపై రకరకాల అనుమానాలున్నాయి. ఇప్పుడు మరిన్ని అనుమానాలను సృష్టిస్తున్నారు పవన్ కల్యాణ్, లోకేష్. తాజాగా శంఖారావం యాత్ర మొదలు పెట్టిన లోకేష్.. స్టేజ్ పై కాసేపు పవన్ భజన చేశారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కష్టకాలంలో తనకు అండగా నిలబడ్డారని చెప్పారు లోకేష్. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. టీడీపీ, జనసేనల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ పేటీఎం బ్యాచ్‌ చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

పవన్ కూడా..

ఈమధ్య పవన్ కల్యాణ్ కూడా పొత్తు వ్యవహారాలపై జనసేన శ్రేణులకు ఓ బహిరంగ లేఖ రాశారు. జనహితం, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నామని, చర్చలు కొనసాగుతున్న దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలను ప్రచారం చేయొద్దంటున్న పవన్.. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా ఎవరైనా ప్రకటనలు చేస్తే, వారి నుంచి వివరణ తీసుకుంటామని సున్నితంగా హెచ్చరించారు.

అన్నిచోట్లా అసంతృప్తి..

టీడీపీ, జనసేన పొత్తులకు సంబంధంచి అధినేతల అవకాశవాద రాజకీయాలు ఎలా ఉన్నా.. కేడర్ మాత్రం అడ్జస్ట్ కాలేకపోతోంది. చాలా చోట్ల ఈ వ్యవహారం శృతిమించుతోంది. కూటమి అధికారంలోకి వచ్చినా పవన్ కు కనీసం ఒక్కరోజు కూడా సీఎం అయ్యే ఛాన్స్ దొరకదనేది జనసైనికుల బాధ. అలాంటప్పుడు చంద్రబాబుకి ఊడిగం చేయడం దేనికని, సొంతగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సత్తా చూపిస్తామంటున్నారు జనసైనికులు. పొత్తుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అటు టీడీపీ నేతల్లో సీట్లు త్యాగం చేయాల్సిన కొందరి వాదన కూడా ఇదే. సోషల్ మీడియాలో వీరంతా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో కూటమి పోటీ చేసినా ఓట్ ట్రాన్స్ ఫర్ మాత్రం నూటికి నూరు శాతం ఈ రెండు పార్టీల మధ్య సాధ్యం కాకపోవచ్చు. అందుకే అధినేతలు ఇంతలా బాధపడుతున్నారు. టీడీపీ, జనసేన కలయిక సరిగా కుదరక దానికి వైసీపీ కారణం అంటూ విమర్శలు మొదలు పెట్టారు. 

Tags:    
Advertisement

Similar News