నాగబాబు సెటైర్లు: జనసేన, టిడిపి పొత్తుపై పెరుగుతున్న విభేదాలు

టిడిపిని పరోక్షంగా టార్గెట్‌ చేస్తూ నాగబాబు ట్వీట్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటనను సమర్థిస్తూ టీడిపికి ఆయన కౌంటర్‌ ఇచ్చారు.

Advertisement
Update: 2024-01-27 15:42 GMT

తెలుగుదేశం పార్టీకి, జనసేనకు మధ్య ఏర్పడిన పొత్తు అంత సజావుగా సాగేట్లు కనిపించడం లేదు. రెండు నియోజకవర్గాలకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అభ్యర్థులను ప్రకటించడంతో రగిలిపోయిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తాము పోటీ చేసే రెండు స్థానాలను ప్రకటించారు. దీంతో ఇరుపార్టీల మధ్య విభేదాలు పొడసూపాయి. పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు చేసిన ట్వీట్‌తో విభేదాలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

టిడిపిని పరోక్షంగా టార్గెట్‌ చేస్తూ నాగబాబు ట్వీట్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటనను సమర్థిస్తూ టీడిపికి ఆయన కౌంటర్‌ ఇచ్చారు. న్యూటన్‌ మూడో సూత్రాన్ని గుర్తు చేస్తూ చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఆయన అన్నారు. మరోవైపు టిడిపి పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని మాజీ మంత్రి హరిరామజోగయ్య అన్నారు. అదే విషయాన్ని పవన్‌ కల్యాణ్‌ చెబుతూ తాము రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు.

ఇదిలావుంటే, పవన్‌ కల్యాణ్‌ ప్రకటనపై జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత పరిణామం టిడిపి, జనసేన పొత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. తమ పార్టీపై పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రకటనపై ఎవరూ మాట్లాడవద్దని టిడిపి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. పవన్‌ కల్యాణ్‌ ప్రకటనతో టిడిపి కార్యకర్తలు శుక్రవారం మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఇంటికి వచ్చారు. రాజోలు నుంచి టిడిపి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందనే నమ్మకం పెట్టుకున్న తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భారీ షాక్‌ ఇచ్చినట్లు టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి.

పవన్‌ కల్యాణ్‌ ప్రకటనపై ఏమీ మాట్లాడవద్దని పార్టీ కార్యకర్తలకు గొల్లపల్లి సూర్యారావు చెప్పారు. అయితే, వారు ఆయన మాట వినకుండా శనివారంనాడు అచ్చెన్నాయుడిని కలవడానికి మంగళగిరి వచ్చి ఆయనతో సమావేశమయ్యారు.

రాజానగరం టిడిపి శ్రేణులు కూడా పవన్‌ కల్యాణ్‌ ప్రకటనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. టీడీపీ ఇంచార్జి బొద్దు వెంకటరమణ చౌదరి పార్టీని బలోపేతం చేసిన నేపథ్యంలో జనసేన ఈ సీట్లో పోటీ చేస్తామని ప్రకటించడం సరి కాదని టిడిపి వర్గాలంటున్నాయి.

Tags:    
Advertisement

Similar News