మొలతాడు కట్టనివాడు.. లాగు వేసుకోనివాడు.. పవన్‌ పరువు తీసేసిన ముద్రగడ

కొందరు తెలిసితెలియక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చు.. కానీ రాజకీయాల్లో తాను హీరోనంటూ చెప్పుకొచ్చారు ముద్రగడ.

Advertisement
Update: 2024-03-16 07:35 GMT

తాను రాజకీయాల్లోకి రావడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. రాజకీయాలు తన ఇష్టం అని చెప్పారు. వైసీపీలో చేరిన తర్వాత తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొలతాడు కట్టనివాడు, లాగు వేసుకోనివాడు కూడా తనకు రాజకీయ పాఠాలు చెప్తున్నాడంటూ ఫైర్ అయ్యారు ముద్రగడ.

కొందరు తెలిసితెలియక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో కావచ్చు.. కానీ రాజకీయాల్లో తాను హీరోనంటూ చెప్పుకొచ్చారు ముద్రగడ. పెద్ద హీరో కాకపోయినా తాను చిన్న హీరోనన్నారు ముద్రగడ. ముఖ్యమంత్రి కుటుంబానికి ఓ చరిత్ర ఉందని, సీఎం జగన్ తండ్రి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారని.. జగన్‌ సైతం ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి పదవులు చేస్తున్నారని గుర్తు చేశారు. సీఎం జగన్‌ పార్టీలోకి రావాలని కొంత మంది పెద్దలను తన దగ్గరకు పంపించారని.. ఆ ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించానని చెప్పారు ముద్రగడ. పవన్ కల్యాణ్ గొప్ప ఏంటని ప్రశ్నించారు ముద్రగడ. సినిమా ఫీల్డ్‌లో పవన్‌ గొప్పవాడు కావొచ్చు కానీ తాను రాజకీయాల్లో గొప్పవాడ్ని అని చెప్పారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్లు పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు ముద్రగడ. జాతి కోసం పవన్ కల్యాణ్‌ పోరాడితే ఎవరన్నా వద్దన్నారా.. పోరాడే హక్కు పవన్ కల్యాణ్‌కు లేదా అంటూ ఫైర్ అయ్యారు. కాపు ఉద్యమం కోసం కనీసం ఏనాడైనా సానుభూతి ఉత్తరమైనా రాశాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నా కుటుంబాన్ని, కార్యకర్తలను, జాతిని అవమానించినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు, బూటు కాళ్లతో తన్నినప్పుడు పవన్‌ బయటికొచ్చారా అని అడిగారు. నిన్న కాక మొన్న పుట్టిన వాడి ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం తనకు లేదన్నారు ముద్రగడ.

జగన్ ఆదేశిస్తే ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. పోటీ చేయమంటే చేస్తానని చెప్పారు. ఇప్పటికే అభ్యర్థుల జాబితా సిద్ధమైపోయిందని, జగన్‌ను డిస్టర్బ్ చేయనని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని, కానీ అలాంటి చర్చ ఇప్పటివరకూ జరగలేదన్నారు ముద్రగడ.

Tags:    
Advertisement

Similar News