ఇంతకీ కేశినేని టార్గెట్ ఎవరు..?

కొత్త సంవత్సరం సందర్భంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు, వార్నింగ్ పార్టీలో సంచలనంగా మారింది. రాబోయే ఎన్నికల్లో తాను, కూతురు శ్వేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీచేయటంలేదన్నారు.

Advertisement
Update: 2024-01-02 04:37 GMT

రోజుకో స్టేట్మెంట్‌తో విజయవాడ తెలుగుదేశంపార్టీ ఎంపీ కేశినేని నాని పిచ్చెక్కిచ్చేస్తున్నారు. ఏ రోజు ఎవరిని టార్గెట్ చేస్తారో తెలీటంలేదు. ఒకసారి డైరెక్టుగా చంద్రబాబునాయుడికే వార్నింగ్ ఇస్తారు. మరోసారి తన వ్యతిరేకులపై విరుచుకుపడతారు. ఎంపీ ప్రకటనలు, వార్నింగులతో పార్టీకి డ్యామేజి జరుగుతున్నా ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. ఒకరోజు రాబోయే ఎన్నికల్లో తానే ఎంపీగా పోటీచేస్తున్నట్లు చెబుతారు. మరోసారి రాబోయే ఎన్నికల్లో తాను పోటీకి దూరమంటారు. ఇంకోసారి తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసినా గెలుస్తానంటారు.

తాజాగా అంటే కొత్త సంవత్సరం సందర్భంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు, వార్నింగ్ పార్టీలో సంచలనంగా మారింది. రాబోయే ఎన్నికల్లో తాను, కూతురు శ్వేత విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీచేయటంలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా కేశినేని లేదా కూతురు శ్వేత ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. బహుశా ఆ ప్రచారానికి ఫులిస్టాప్ పెట్టడానికే ఈ ప్రకటన చేశారేమో అనిపిస్తోంది. కొన్ని కంబంధ హస్తాల నుండి పశ్చిమ నియోజకవర్గానికి విముక్తి కల్పించటానికే నియోజకవర్గ ఇన్చార్జిగా వచ్చినట్లు చెప్పారు.

పశ్చిమ నియోజకవర్గం నుండి కొన్ని కబంధహస్తాల నుండి విముక్తి అని ఎవరిని ఉద్దేశించి అన్నారో అర్థంకావటంలేదు. విజయవాడ నగరంలో బుద్ధా వెంకన్న, బోండా ఉమ, నాగూల్ మీరా లాంటి వాళ్ళు ఎంపీకి బద్దవ్యతిరేకులు. వీళ్ళకి మాజీమంత్రి దేవినేని ఉమ తెరవెనుక నుండి పూర్తి మద్దతిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కాబట్టి వీళ్ళల్లో ఎవరిని ఎంపీ హెచ్చరించారో తెలీటంలేదు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేవారిని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఈ స్ధాయిలో ఎప్పుడూ ఎవరికీ వార్నింగ్ ఇవ్వలేదు.

ఏలుకుంటాం, దోచుకుంటాం అంటే కుదరదన్నారు. తాను విజయవాడకు కాపలాకుక్క లాగుంటానని ప్రకటించారు. చీకటి వ్యాపారాల్లో తాను వాటాదారుడిని కాదన్నారు. తాను వెళ్ళిపోతే విజయవాడ నుండి జగ్గయ్యపేట వరకు దోచుకోవచ్చన్నది వీళ్ళ ఆలోచనగా ఎంపీ చేసిన ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. విజయవాడలో తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారా..? లేకపోతే వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్న చంద్రబాబునే టార్గెట్ చేశారా అన్నది అర్థంకావటంలేదు.

Tags:    
Advertisement

Similar News