వైసీపీలో ఐదో వికెట్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

వైసీపీలో ఇప్పుడు ఐదో వికెట్ పడింది. మిగతా నలుగురు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు, ఆళ్ల మాత్రం తన పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీకి షాకిచ్చారు. ఆ రాజీనామా ఆమోదిస్తారా, లేక ఆయన్ను బుజ్జగిస్తారా అనేది తేలాల్సి ఉంది.

Advertisement
Update: 2023-12-11 07:27 GMT

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నా.. సీఎం జగన్ ను కాదని బయటకుపోయే సాహసం చేయరని అందరూ అనుకొన్నారు. కానీ, ఆయన జగన్ కి దూరం జరగడానికే నిర్ణయించుకున్నారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కి లేఖ పంపించారు.

ఎందుకీ నిర్ణయం..?

మంగళగిరిలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. 2019లో మంత్రి హోదాలో పోటీ చేసిన లోకేష్ ని కూడా మట్టికరిపించారు. లోకేష్ ని ఓడించిన ఆర్కేకి మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారంతా. కానీ రెండు విడతల్లో కూడా ఆయనకు ఆ పదవి అందని ద్రాక్షే అయింది. రాగాపోగా ఇప్పుడు ఎమ్మెల్యే సీటుకి కూడా ఎసరు వచ్చేలా ఉంది. మంగళగిరిలో ఈసారి కూడా టీడీపీ తరపున లోకేష్ పోటీ చేయబోతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా బీసీ అభ్యర్థి గంజి చిరంజీవికి టికెట్ ఇవ్వాలని వైసీపీ ఆలోచిస్తోంది. దీంతో ఆళ్లకు సెగ మొదలైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

ఐదో వికెట్..

2019లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది. వివిధ కారణాలతో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో అదను చూసి వారిపై వేటు వేసింది వైసీపీ. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి.. ఆ నలుగురి బాటలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా చేరడం విశేషం. అంటే వైసీపీలో ఇప్పుడు ఐదో వికెట్ పడింది. మిగతా నలుగురు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు, ఆళ్ల మాత్రం తన పదవికి కూడా రాజీనామా చేసి వైసీపీకి షాకిచ్చారు. ఆ రాజీనామా ఆమోదిస్తారా, లేక ఆయన్ను బుజ్జగిస్తారా అనేది తేలాల్సి ఉంది.

*

Tags:    
Advertisement

Similar News