పవన్ ఎంత తిరిగితే మాకు అంత మంచిది -రోజా

11వేల కోట్ల రూపాయలతో జగనన్న కాలనీలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సేకరించిందని, కానీ ఆ పథకంలో 15వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పడం పవన్ అవివేకానికి నిదర్శనం అని దుయ్యబట్టారు మంత్రి రోజా.

Advertisement
Update: 2022-11-14 16:20 GMT

పవన్ కల్యాణ్ జనాల్లో ఎంత తిరిగితే తమ పార్టీకి అంత మంచిదని అన్నారు మంత్రి రోజా. జనాలకు జగన్ ఏం చేస్తున్నారనేది పవన్ పర్యటనల వల్ల మరింత బాగా తెలిసొస్తుందని చెప్పారు. జగనన్న ఇళ్ల విషయంలో పవన్ కల్యాణ్ చేస్తున్న పర్యటనల వల్ల ఆ పథకం గొప్పతనం మరోసారి ప్రజలకు అర్థమవుతోందని వివరించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా జగన్ లాగా పేదలకోసం ఇళ్లు నిర్మించలేదని చెప్పారు రోజా. దేశంలో ఏ సీఎం అయినా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారా.. అని ప్రశ్నించారు.

నోవాటెల్ లో సెట్ అయిన ప్యాకేజీ..

మొన్నటి వరకూ చంద్రబాబుపై పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారని, కానీ నోవాటెల్ లో ప్యాకేజీ సెట్ అయిన తర్వాత ఆయన పంథా మారిందని అన్నారు రోజా. కేవలం జగన్ ని మాత్రమే టార్గెట్ చేస్తూ పవన్ తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. 11వేల కోట్ల రూపాయలతో జగనన్న కాలనీలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సేకరించిందని, కానీ ఆ పథకంలో 15వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పడం పవన్ అవివేకానికి నిదర్శనం అని దుయ్యబట్టారు.

ఎవరైనా ఫిర్యాదు చేశారా..?

జగనన్న కాలనీల వద్దకు వెళ్తున్న పవన్ కల్యాణ్ కి ఎక్కడైనా, ఎవరైనా అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు మంత్రి రోజా. ఇంటి స్థలం కేటాయించడానికి కానీ, ఇళ్లు నిర్మించడానికి కానీ లంచం తీసుకున్నట్టు, అడిగినట్టు ఎవరైనా ఫిర్యాదు చేశారా అని అడిగారు. ఎక్కడా ఎలాంటి లంచాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు రోజా. చంద్రబాబు నోవాటెల్ లో ఇచ్చిన స్క్రిప్ట్ నే పవన్ కల్యాణ్ చదువుతున్నారని మండిపడ్డారు. ప్రధానితో రాష్ట్రం కోసం పవన్‌ ఏం మాట్లాడారో బహిరంగపరచాలని డిమాండ్ చేశారు రోజా. అసలు మోదీతో ఏనాడైనా రాష్ట్రం కోసం పవన్ మాట్లాడారా అని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News