నగరి కోర్టులో పరువునష్టం దావా వేసిన మంత్రి రోజా

ఇటీవల హీరోయిన్ త్రిషపై సహనటుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా మంత్రి రోజా స్పందించారు. గతంలో బండారు వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే మరొకరు అలా మాట్లాడడానికి భయపడతారని చెప్పారు రోజా.

Advertisement
Update: 2023-11-21 14:55 GMT

మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. ఆ వ్యాఖ్యలపై కేసు నమోదు కావడం, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం, బెయిల్ పై ఆయన బయటకు రావడం అందరికీ తెలిసిందే. అయితే ఆ కేసు వ్యవహారంలో ముందడుగు పడుతుందా లేదా అనుకుంటున్న దశలో మళ్లీ మంత్రి రోజా తెరపైకి వచ్చారు. బండారు సత్యనారాయణపై పరువు నష్టం దావా వేశారు. ఆయనతోపాటు, టీడీపీ నగరి ఇన్ చార్జ్ గాలి భాను ప్రకాష్, టీవీ రాజేంద్రప్రసాద్ పై కూడా క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు. నగరి కోర్టు మంత్రి రోజా ఈపిటిషన్ ను విచారణకు స్వీకరించింది.

మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెకు సహచర నటీనటులంతా బాసటగా నిలిచారు. వైసీపీ నేతలు కూడా ఆమెకు మద్దతిచ్చారు, మహిళా సంఘాలు, మహిళా కమిషన్ కూడా రోజాకి మద్దతుగా మాట్లాడాయి. పోలీసులు బండారుని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు. అయితే బెయిల్ పై ఆయన బయటకు రావడంతో అక్కడితో ఆ వ్యవహారం సద్దుమణిగినట్టయింది. బండారుని కోర్డుకీడుస్తానని, ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని గతంలోనే మంత్రి రోజా ప్రకటించారు. ఇప్పుడు ఆమె నగరి కోర్టులో పిటిషన్ వేశారు.

ఇటీవల హీరోయిన్ త్రిషపై సహనటుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా మంత్రి రోజా స్పందించారు. గతంలో బండారు వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే మరొకరు అలా మాట్లాడడానికి భయపడతారని చెప్పారు రోజా. బండారు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని రోజా తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. 

Tags:    
Advertisement

Similar News