మాకు నమ్మకం లేదు.. ఇన్ని దారుణాలా..?

నెల్లూరు జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పనిచేశారని విమర్శించారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షించేందుకు ఒక అబ్జర్వర్ ని నియమించాలన్నారు కాకాణి.

Advertisement
Update: 2024-05-26 09:26 GMT

ఏపీలో, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందనే నమ్మకం తమకు లేదన్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. జిల్లా రిటర్నింగ్ అధికారిగా ఉన్న ప్రస్తుత కలెక్టర్ ఆధ్వర్యంలో లెక్కింపు సజావుగా సాగదని అనుమానం వ్యక్తం చేశారాయన. జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పనిచేశారని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ పర్యవేక్షించేందుకు ఒక అబ్జర్వర్ ని నియమించాలన్నారు కాకాణి.

ఏపీలో ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు మంత్రి కాకాణి. పోలీస్ అధికారులను ఉద్దేశ పూర్వకంగా బదిలీ చేసిందని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు ఆయా జిల్లాల్లో ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని చెప్పారు. వైసీపీ బలంగా ఉన్న చోట కేడర్‌ని భయబ్రాంతులకు గురి చేశారని, టీడీపీ దాడులకు పరోక్షంగా సాయం చేశారని చెప్పారు. మాచర్లలో ఈవీఎం పగలగొట్టిన ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందన్నారు కాకాణి.

నెల్లూరు జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రోజు కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపించారు మంత్రి కాకాణి. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల నిధులు దుర్వినియోగం చేశారని, విధి నిర్వహణలో వైఫల్యం చెందారని అన్నారు. నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకి డబ్బులు పంచారని.. దానిపై ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని అన్నారు కాకాణి. మానవతా దృక్పధంతో సోమిరెడ్డి డబ్బులు పంచారని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదమన్నారు. సోమిరెడ్డి డబ్బులు పంచిన ఘటనపై ఈసీ చర్యలు తీసుకోకపోతే.. హైకోర్టుకి వెళ్తానన్నారు కాకాణి. 

Tags:    
Advertisement

Similar News