అల్పపీడనం.. వాయుగుండంగా.. ఆపై తుపానుగా..

వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు

Advertisement
Update: 2024-05-24 02:34 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారుతోందని, ఆపై అది తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం నాటికి వాయుగుండంగా మారనున్న అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

శుక్రవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడిందని, అది క్రమేపీ వాయుగుండంగా మారుతోందని, ఈనెల 26వ తేదీ సాయంత్రానికి అది మరింత బలపడి తుపానుగా మారుతుందని వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఈశాన్యంగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నప్పటికీ దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతానికి ముప్పేమీ లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News