జగన్ శాంతి మంత్రం.. కోనసీమ అల్లర్ల కేసుల ఉపసంహరణ

కేసుల ఉపసంహరణపై కోనసీమ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై అంతా కలిసే ఉంటామన్నారు, గొడవలకు పోమని సీఎం జగన్ కి హామీ ఇచ్చారు.

Advertisement
Update: 2023-03-29 01:53 GMT

కోనసీమ జిల్లా పేరుమార్పు వ్యవహారంలో అమలాపురంలో జరిగిన అల్లర్లపై నమోదైన కేసులను ప్రభుత్వం ఉపసంహరించింది. ఈమేరకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోనసీమ ప్రాంత నేతలు, ఆయా సామాజిక వర్గాల నాయకులతో క్యాంప్ కార్యాలయంలో సమావేశమైన జగన్, తన నిర్ణయాన్ని ప్రకటించారు. అందరూ కలసి మెలసి ఉండాలని, గొడవలు వద్దని, ప్రశాంతమైన వాతావరణాన్ని పాడుచేయొద్దని సూచించారు. కేసుల ఉపసంహరణపై కోనసీమ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై అంతా కలిసే ఉంటామన్నారు, గొడవలకు పోమని సీఎం జగన్ కి హామీ ఇచ్చారు.

జగన్ ఏం చెప్పారంటే..?

"తరతరాలుగా మీరంతా అదే ప్రాంతంలో కలసిమెలసి జీవి­స్తు­న్నారు, అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, జీవిత చరమాం­కం వరకూ అక్కడే ఉంటారు. రేపటి తరాలు కూడా అక్కడే జీవించాలి కదా. భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగిన­ప్పుడు వాటిని మరిచిపోయి మీరంతా మళ్లీ కలిసి మెలిసి జీవించాలి. లేదంటే భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈ గొడవల్ని, కేసుల్ని ఇలాగే లాగుతూ పోతే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. దీనివల్ల నష్టపోయేది మనమే. అందుకే అందరం కలిసి ఉండాలి. ఆప్యాయతతో ఉండాలి. మిమ్మ­ల్ని ఏకం చేయడం కోసం ఈ ప్రయత్నమంతా చేస్తున్నాం." అని అన్నారు జగన్.

అమలాపురంలో అల్లర్లు జరిగిన సమయంలో మంత్రి పినిపే విశ్వరూప్ ఇల్లు తగలబెట్టారు ఆందోళనకారులు, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడి జరిగింది. ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని కేసులు పెట్టి, విచారణ మొదలు పెట్టింది. అయితే అవి కక్షపూరితంగా చేసిన దాడులు కావని, తీవ్ర భావోద్వేగాల నడుమ అలాంటి పరిస్థితులు తలెత్తాయని కొంతమంది నాయకులు సీఎం జగన్ కి విన్నవించారు. మంత్రి, ఎమ్మెల్యే కూడా ఆ గొడవలను తాము వ్యక్తిగతంగా తీసుకోలేదని, తాము మనస్ఫూర్తిగా కేసులన్నీ ఉపసంహరించుకుంటున్నామని చెప్పారు. అందరం సమన్వయంతో ముందుకెళ్తామన్నారు. 

Tags:    
Advertisement

Similar News