టీడీపీపై కోడెల శివరాం సంచలన వ్యాఖ్యలు

సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై కోడెల శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Update: 2023-06-01 06:49 GMT

టీడీపీపై కోడెల శివరాం సంచలన వ్యాఖ్యలు

కోడెల శివప్రసాద్‌ రావు కుమారుడు కోడెల శివరాం టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ కోసం ప్రాణాలిచ్చిన తన తండ్రి కోసం మహానాడులో ఐదు నిమిషాలు కేటాయించకపోవడం బాధ కలిగించిందన్నారు. పదవులు వస్తాయంటే ఒక పార్టీ, పదవులు ఇస్తామంటే మరో పార్టీ ఇలా మూడు పార్టీలు మారిన కన్నా లక్ష్మీనారాయణకు తన తండ్రికి పోలికేంటని ప్రశ్నించారు. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో రాజకీయం కోడెల వర్సెస్ కన్నా లక్ష్మీనారాయణ అన్నట్టుగానే సాగిందన్నారు. అప్పట్లో ఇదే కన్నా టీడీపీ కార్యకర్తలను వేధిస్తుంటే వారికి అండగా నిలబడిన వ్యక్తి తన తండ్రి అని శివరాం ఫైర్ అయ్యారు.

తొలి నుంచి నమ్మకంగా పార్టీ కోసం ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా పర్వాలేదు గానీ అవమానించడం మాత్రం తప్పన్నారు. అవమానాలు, కష్టాలు తమ జీవితంలో భాగమైపోయాయన్నారు. చివరకు తన తల్లిని కూడా అవమానించారని ఆవేదన చెందారు. చంద్రబాబును కలిసి కనీసం ఐదు నిమిషాల పాటు తమ ఇబ్బందులను వివరించాలని మూడేళ్లుగా ఎదురు చూస్తున్నామని కానీ ఆ అవకాశం దక్కలేదన్నారు. కోడెల ఆత్మీయుల కోసం భవిష్యత్తులోనూ తాను నిలబడుతానని చెప్పారు. వారి నిర్ణయం ప్రకారమే తానూ నడుచుకుంటానని వివరించారు.

ఇతర పార్టీల నుంచి ఆఫర్లు అన్న ప్రచారం కేవలం ఆపోహ మాత్రమేనని.. కానీ వచ్చే ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచి కోడెల శివప్రసాద్ రుణం తీర్చుకుంటానని శివరాం ప్రకటించారు. చంద్రబాబు పిలిచి మాట్లాడుతారని ఇప్పటికీ తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. పార్టీలో ఈ పరిణామాలు చంద్రబాబుకు తెలియకుండానే జరుగుతున్నాయని.. వాటిని సరి చేసి తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఇప్పటికీ ఉందన్నారు.

సత్తెనపల్లి సీటు కోసం మొన్నటి వరకు కోడెల శివరాం, ఆంజనేయులు, అబ్బూరి మల్లి మధ్య పోటీ నడిచింది. అయితే హఠాత్తుగా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి ఇన్‌చార్జ్‌గా చంద్రబాబునాయుడు బుధవారం ప్రకటించారు. దాంతో కోడెల శివరాం పార్టీపై భగ్గుమన్నారు.

Tags:    
Advertisement

Similar News