45 రాజ్యసభ సీట్లలో ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వలేదు

ఎన్నికలొచ్చాయి కాబట్టి ఓట్ల కోసం చంద్రబాబుకు బీసీలు గుర్తొచ్చారని కొడాలి నాని విమర్శించారు. వాడుకుని వదిలేయడం.. ఓడిపోయే చోట సీట్లివ్వడం చంద్రబాబుకు అలవాటని ఆయన చెప్పారు.

Advertisement
Update: 2024-01-05 02:51 GMT

బీసీలను ఓటు బ్యాంకులా వాడుకుని రాష్ట్ర సంపదను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు టీడీపీని స్వాధీనం చేసుకున్నాక ఎన్ని రాజ్యసభ సీట్లు బీసీలకు ఇచ్చాడంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కేటాయించిన 45 రాజ్యసభ సీట్లలో ఒక్కటి కూడా బీసీలకు ఇవ్వలేకపోయాడని ఆయన తెలిపారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీసీల విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును ఎండగట్టారు.

అందుకే బాబుకు బీసీలు గుర్తొచ్చారు..

ఎన్నికలొచ్చాయి కాబట్టి ఓట్ల కోసం చంద్రబాబుకు బీసీలు గుర్తొచ్చారని కొడాలి నాని విమర్శించారు. వాడుకుని వదిలేయడం.. ఓడిపోయే చోట సీట్లివ్వడం చంద్రబాబుకు అలవాటని ఆయన చెప్పారు. 2019లో మంగళగిరిలో గంజి చిరంజీవికి చంద్రబాబు ఎందుకు సీటివ్వలేకపోయాడని ప్రశ్నించారు. కొడుకు కోసం బీసీలను తప్పించిన చరిత్ర నీదే చంద్రబాబూ అని విమర్శించారు. 2024లో చంద్రబాబుకు కచ్చితంగా బీసీలు బుద్ధి చెబుతారని ఆయన స్పష్టంచేశారు.

బీసీలకు జగన్‌ ఇచ్చిన ప్రాధాన్యతకు ఆ పదవులే సాక్ష్యం

సీఎం జగన్‌ బీసీలకు ఏం చేశారో ఆయన ఇచ్చిన పదవులే సాక్ష్యమని కొడాలి నాని చెప్పారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైసీపీ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సీఎం జగన్‌ 8 రాజ్యసభ సీట్లలో నాలుగు బీసీలకు ఇచ్చారన్నారు. 17 ఎమ్మెల్సీలను బీసీలకిచ్చారని చెప్పారు. కార్పొరేషన్లు, మార్కెట్‌ యార్డులు, జిల్లా పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు సగం కంటే ఎక్కువ అవకాశం ఇచ్చారని తెలిపారు. కనీసం రానున్న ఎన్నికల్లో అయినా.. వైసీపీ కంటే ఎక్కువ సీట్లు బీసీలకు ఇవ్వగలమని టీడీపీ ఛాలెంజ్‌ చేయగలదా అని ఆయన సవాల్‌ విసిరారు.

జగన్‌ రెక్కల కష్టం మీద ఏర్పడిన పార్టీ వైసీపీ

వైఎస్‌ జగన్‌ రెక్కల కష్టం మీద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడిందని నాని చెప్పారు. వైఎస్‌ జగన్‌ వల్లే తామంతా వైసీపీలో ఎమ్మెల్యేలుగా గెలిచామని స్పష్టంచేశారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఏర్పాటు చేసుకోవడం తమ పార్టీ అంతర్గత వ్యవహారమని ఆయన చెప్పారు. గుడివాడలో తనను ఓడిస్తానని తన చిన్నప్పటి నుంచి చంద్రబాబు చెబుతున్నాడని, ఇప్పుడెవడినో అమెరికా నుంచి తెచ్చాడని, ఎన్నికలయ్యాక వాడూ పోతాడని ఆయన తెలిపారు. ఎన్టీఆర్‌కి వారసుడిని నేనా.. వాళ్లా అనేది గుడివాడ ప్రజలే తేలుస్తారని ఆయన స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News