మొన్న జనవాణి, నేడు సోషల్ ఆడిట్.. జనసేన మరో పోరాటం..

సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేసి, నిలదీసి, పథకాలను సక్రమంగా అమలు చేసేలా చూస్తామంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఇందులో తొలివిడతగా జగనన్న ఇళ్లు గుల్ల పథకం అనే పేరుతో సోషల్ ఆడిట్ నిర్వహించబోతోంది జనసేన.

Advertisement
Update: 2022-11-02 06:53 GMT

ఏపీలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ ఒక్కో పార్టీ ఒక్కో ఎత్తుగడతో జనంలోకి వెళ్లాలనుకుంటోంది. అధికార వైసీపీకి నవరత్నాల అమలు అనేది పెద్ద అడ్వాంటేజీ. అయినా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఎన్నికలనాటికి పెద్ద ఉద్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు జగన్. టీడీపీకి ఇంకా పట్టు దొరకలేదు. బాదుడే బాదుడు అంటూ జనంలోకి వెళ్లాలని చూసినా పెద్దగా స్పందన లేదు. మరోవైపు జనసేన కూడా తంటాలు పడుతోంది. జనవాణి కార్యక్రమానికి జనం వస్తున్నా దానివల్ల జనసేనకు కలిగే రాజకీయ లాభం ఏంటో అర్థం కావడంలేదు. జనవాణిలో ఇచ్చే అర్జీలను తిరిగి పవన్ కల్యాణ్ ప్రభుత్వ అధికారుల వద్దకే పంపుతున్నారు. నేరుగా స్పందనలో అర్జీ ఇచ్చి, ఆ తర్వాత జనవాణి ద్వారా మరో ఇర్జీ ఇస్తున్నారే కానీ వాటికి పెద్దగా ఫలితం లేదు. ఇప్పుడు కొత్తగా జనసేన సోషల్ ఆడిట్ అంటూ మరో పోరాట పంథాను ఎంచుకుంది.

సోషల్ ఆడిట్ ఏంటి..?

ప్రభుత్వం పథకాలు క్షేత్ర స్థాయిలో సరిగా అమలవుతున్నాయా లేదా, వాటి లోటుపాట్లేంటి, ప్రజల ఇబ్బందులేంటి అనే వాటిపై ప్రజల నుంచే సమాచారాన్ని సేకరిస్తుంది జనసేన. ఇలా సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేసి, నిలదీసి, పథకాలను సక్రమంగా అమలు చేసేలా చూస్తామంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఇందులో తొలి విడతగా జగనన్న ఇళ్లు గుల్ల పథకం అనే పేరుతో సోషల్ ఆడిట్ నిర్వహించబోతోంది జనసేన.

ఈనెల 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్లపై పక్కాగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తామంటున్నారు జనసేన నేతలు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం దోబూచులాట ఆడుతోందని విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న కాలనీలు, పట్టణ ప్రాంతాల్లో టిడ్కో గృహాలు అర్హులైన పేదలకు సకాలంలో అందడంలేదని అంటున్నారు. జగనన్న కాలనీల పరిస్థితి ఎలా ఉందో బయటపెడతామని హెచ్చరిస్తున్నారు. జనవాణి లాగా ఈ సోషల్ ఆడిట్ కూడా ఉంటుందా, లేక దీని ద్వారా ప్రభుత్వంపై నిజంగానే జనసేన ఒత్తిడి పెంచగలుగుతుందా అనేది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News