వైసీపీ విముక్త ఏపీనే మా లక్ష్యం- పవన్ కల్యాణ్

నేరస్వభావం ఉన్న జగన్‌ లాంటి వ్యక్తులను అధికారానికి దూరం చేసినప్పుడు మాత్రమే రాష్ట్రం బాగుపడుతుందని పవన్ వ్యాఖ్యానించారు. విశాఖ దసపల్లా భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు.

Advertisement
Update: 2022-10-17 13:53 GMT

వైసీపీ నుంచి ఏపీకి విముక్తి కల్పించడమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. తన సినిమా రిలీజ్ అయిన సమయంలోనే టికెట్ల రేట్లు తగ్గిపోతాయ‌ని, తన పుట్టిన రోజు వచ్చినప్పుడే ప్లాస్టిక్ ఫ్లెక్సీల విషయంలో ప్ర‌భుత్వానికి పర్యావరణం గుర్తుకు వస్తుందని వ్యాఖ్యానించారు. నేరస్వభావం ఉన్న జగన్‌ లాంటి వ్యక్తులను అధికారానికి దూరం చేసినప్పుడు మాత్రమే రాష్ట్రం బాగుపడుతుందని పవన్ వ్యాఖ్యానించారు. విశాఖ దసపల్లా భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు.

ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉన్న మంత్రి 71 ఎకరాల మాజీ సైనికుల భూమిని ఎందుకు ఆక్రమించారని ప్రశ్నించారు. ఒక పోలీస్ అధికారి తనతో గొడవ పెట్టుకున్నారని.. తనను రెచ్చగొట్టి గొడవ సృష్టించేందుకు ప్రయత్నించారని, అందుకే తాను సంయమనం పాటించానన్నారు ప‌వ‌న్‌.

వైఎస్‌ వివేకానందరెడ్డి కేసులో చివరకు మీడియా కూడా భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలను చైతన్యం చేసే నాయకత్వాల పరంపర లేకుండా పోయిందన్నారు. రాజకీయాల నుంచి క్రిమినల్స్‌ను తరిమికొట్టాలన్నారు. రాజకీయాలంటే భయపడే ప‌రిస్థితిని వైసీపీ నేతలు క‌ల్పించార‌ని ఆరోపించారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తే దాన్ని భావ ప్రకటన స్వేచ్చ అని డీజీపీ సమర్థించారని ప‌వ‌న్‌ వ్యాఖ్యానించారు.

ఎయిర్‌పోర్టు గొడవకు ముందే ప్లాన్‌ చేశారని.. అందుకే మంత్రులకు పోలీసులు సెక్యూరిటీ కూడా ఇవ్వలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ పాలన వల్ల ఏపీ వారు తిరిగి తెలంగాణకు వలస వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అసలు అధికారంలో ఉన్న పార్టీలు గర్జనలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారానికి దూరంగా ఉన్నవారు, కడుపు మండిన వారు వారి ఆవేదనను చాటేందుకు గర్జనలు చేస్తుంటార‌న్నారు. విశాఖ నుంచి విజ‌య‌వాడ‌ వచ్చిన తర్వాత పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    
Advertisement

Similar News